రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు.. క్లారిటీ

by Gantepaka Srikanth |

రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు

రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు.. క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం రాజకీయాలు ఫాలో అయ్యేవారికి దివంగత కాపు నేత వంగవీటి రంగా(Vangaveeti Ranga) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మాస్ లీడర్‌గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తాజాగా పొలిటికల్ ఎంట్రీపై వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్(Asha Kiran) స్పందించారు. ఆదివారం విజయవాడ, బందరు రోడ్డులో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి ఆశా కిరణ్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇక మీదట తాను రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గత కొంత కాలంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నానని.. ఇకపై తన పూర్తి ప్రయాణం ప్రజలతోనే అని ఆశా కిరణ్ స్పష్టం చేశారు. ఇకపై విజయవాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాధా, రంగా మిత్రా మండలిల మధ్య కొంత గ్యాప్ ఉందని.. ఆ ఖాళీని పూర్తి చేయడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆశా కిరణ్ తెలిపారు. వంగవీటి రంగా, రాధా.. కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా.. సాయం కోరి వచ్చిన వారందరిని ఆదుకున్నారని ఆమె గుర్తు చేశారు. తాను కూడా వారి మార్గంలోనే నడుస్తానని స్పష్టం చేశారు. రాధాకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. ఆయన సలహాలు, సూచనలతోనే కొనసాగుతానని వెల్లడించారు. కాగా, ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇవాళ బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story