Konaseema: కోనసీమలో ఇంకా ఆరని మంటలు.. కొనసాగుతున్న గ్యాస్ లీకేజీ

by Ramesh Naini |

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన తీవ్రత తగ్గలేదు.

Konaseema: కోనసీమలో ఇంకా ఆరని మంటలు.. కొనసాగుతున్న గ్యాస్ లీకేజీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన తీవ్రత తగ్గలేదు. ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి గ్యాస్ లీక్ కారణంగా చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. గ్యాస్ కిలోమీటర్ల మేర వ్యాపించడంతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటికే స్థానికులను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. మంటలు క్రమంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు సుమారు 600 కొబ్బరి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు.

24 గంటల సమయం..?

ఈ ఘటనపై ఓఎన్‌జీసీ (ONGC) అధికారులు లేఖ విడుదల చేశారు. ప్రమాద ప్రాంతం నుంచి 600 మీటర్ల పరిధిలో నివాస ప్రాంతాలు లేవని వెల్లడించారు. గ్యాస్ లీక్‌ను అరికట్టేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఘటనా స్థల పరిస్థితిని తమ సంస్థకు చెందిన సీనియర్ నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఓఎన్‌జీసీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది నిరంతరంగా శ్రమిస్తున్నారు. పరిస్థితిని పూర్తిగా నియంత్రించే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, గ్యాస్ లీక్‌ను పూర్తిగా నియంత్రించేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందని, గ్యాస్ నిల్వలు పూర్తిగా అయిపోతేనే మంటలు ఆగే అవకాశం ఉందని అధికారుల సమాచారం.

Next Story