సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న కేంద్రమంత్రి

by Thanuru Gopichand |

అరసవల్లిలో వైభవోపేతంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి.

సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో (Arasavalli) రథసప్తమి వేడుకలు (Ratha Saptami Celebrations) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సూర్య జయంతిని (Surya Jayanti) పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి మహా క్షీరాభిషేకాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ ఆధ్యాత్మిక వేడుకలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) దంపతులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి పురస్కరించుకుని భక్తులకు కల్పించిన ఏర్పాట్లు, దర్శన సౌకర్యాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దంపతులు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్సీ వరుదు కళ్యాణి తదితర ప్రముఖులు హాజరై ఆదిత్యుడి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

పాలనా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ భక్తుల రద్దీని పర్యవేక్షించారు. అలాగే ఎమ్మెల్యేలు గొండు శంకర్, గురజాల జగన్మోహన్, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు తదితరులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఓ వైపు సూర్యజయంతి, మరోవైపు ఆదివారం సెలవు దినం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు అరసవల్లికి పోటెత్తారు. రాత్రి 9 గంటల నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి, భక్తులందరికీ ఆదిత్యుని కృపాకటాక్షాలు కలగాలని మంత్రులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Next Story