సీఆర్డీఏ కార్యకలాపాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష

by Thanuru Gopichand |   (  Updated:2025-12-13 04:45:26  IST  )

రాజధాని అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏ (Capital Region Development Authority) కార్యకలాపాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన శనివారం నాడు విజయవాడ/అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది.

సీఆర్డీఏ కార్యకలాపాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సీఆర్డీఏ (CRDA) కార్యకలాపాలపై జరిగిన సమీక్షా సమావేశంలో రాజధాని నిర్మాణ పనులతో పాటు రైతు సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు హాజరయ్యారు. రైతు సమస్యల పరిష్కార చర్యల పురోగతిపై దృష్టి సారించిన కేంద్రమంత్రి పెమ్మసాని, జరీబు భూముల సమస్యపై ఒక నెల సమయం అడిగినట్లు వెల్లడించారు. నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించిన తరువాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉండవల్లి లేఅవుట్ అభివృద్ధి ప్రారంభమైందని, లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని తెలిపారు. ప్రస్తుతం 7 వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉందని, భూ సమీకరణ చేయని భూముల్లో ప్లాట్లు పొందిన వారి సమస్య కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. అక్కడ రైతులతో మాట్లాడిన తరువాత భూసేకరణకు వెళ్తామని స్పష్టం చేశారు. వేరే చోట ప్లాట్లు కావాలని అడిగిన వారికి లాటరీ ద్వారా కేటాయించే చర్యలు తీసుకుంటున్నామని, పెద్ద ప్లాట్లు పొందేవారు కొంత సమయం వేచి ఉండాలని కోరారు. కమర్షియల్ ప్లాట్లలో వాస్తు ప్రకారం ఉండాలని కొందరు కోరడంతో 7 ఎకరాల మేర ప్లాట్లు మార్చాల్సి ఉంటుందని, రైతులు మళ్లీ వాస్తు పేరిట రావొద్దని విజ్ఞప్తి చేశారు.

​తాడికొండ బైపాస్ రోడ్డు వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేశారు. వారికి 3 నెలల్లో పరిహారం మరియు టీడీఆర్ (TDR) బాండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనితో పాటు, రాజధాని ప్రాంతంలోని 18 వేల మంది రైతులకు, రైతు కూలీలకు హెల్త్ కార్డులు అందించనున్నట్లు ప్రకటించారు. 26 గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం డీపీఆర్ (DPR) లను సిద్ధం చేస్తున్నామని, వారంలో ఈ డీపీఆర్ లు సిద్ధం చేసి నెలాఖరులోగా పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలియజేశారు. రాజధానిలో సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, స్మశానాల నిర్మాణం చేపడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఈ సమీక్షా సమావేశం దోహదపడింది.

Next Story