నవంబర్ 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

by Thanuru Gopichand |   (  Updated:2025-11-23 04:58:41  IST  )

నవంబర్ 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. అమరావతిలో జరిగే బ్యాంక్ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

నవంబర్ 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్ డెస్క్ : నవంబర్ 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. అమరావతిలో జరిగే బ్యాంక్ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకులకు భూకేటాయింపులు జరిగాయి. అనంతరం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద జరిగే సభకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. నిర్మలా సీతారామన్ తో పాటు గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

12 బ్యాంకులు

ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు తరలి వస్తున్నాయి. 12 ప్రముఖ బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల భవనాలను నిర్మించనున్నారు. గత నెలలోనే శంకుస్థాపనలు చేయాలనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉద్దండరాయునిపాలెం వద్ద బ్యాంకులకు స్థలాలను కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఆయా స్థలాలను బ్యాంకు యాజమాన్యాలు చదును చేశాయి. 2014-19 మధ్యలోనే బ్యాంకుల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినప్పటికీ అప్పుడు బ్యాంకులు ఆసక్తి చూపలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపారు. బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు ఒప్పించి ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్టేట్ బ్యాంక్ కు 3 ఎకరాలు

అమరావతిలో ఏర్పాటు కానున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు 3 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కెనరా బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనాల నిర్మాణం ఒకే సారి ప్రారంభం కానుంది. ఈ భవనాల్లోనే రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

Next Story