- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.. అంతా మంచే జరుగుతుందన్న పంచాంగ కర్త
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా పంచెకట్టు, భుజాన కండువాతో హాజరైన జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం, ప్రముఖ సిద్ధాంతి పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఫలితాలను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి అంతర్జాతీయంగా విశేషమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని, ఇతర దేశాలతో కీలక ఒప్పందాలు జరిగి భారత్ ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు పెరిగే సూచనలు ఉన్నాయని, అయితే వ్యక్తిగతంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీకి ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందని సిద్ధాంతి వెల్లడించారు. పంచాంగ శ్రవణం అనంతరం వేద పండితులు వైఎస్ జగన్ దంపతులకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్యశాస్త్రితో పాటు పలువురు పండితులను జగన్ ఘనంగా సన్మానించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని మాజీ సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు భారీ సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.






