- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి తెరపైకి ఉద్దానం!!
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ఉద్దానం గ్రామం పేరు తెరపైకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ఉద్దానం గ్రామం పేరు తెరపైకి వచ్చింది. తమ ప్రభుత్వ పాలనలో అక్కడి కిడ్నీ వ్యాధి బాధితుల బాధను తీర్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తోంది. అందుకు ధీటుగా బదులిచ్చేందుకు టీడీపీ కూడా విమర్శల బాణాలను సంధిస్తోంది. ఇలా ఇరు పార్టీల మద్ధతుదారుల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది.
నాడు జనసేనాని పర్యటన
ప్రస్తుత డిప్యూటీ సీఎం, నాటి జనసేన (Janasena) పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తొలిసారి 2019 లో ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడి గ్రామస్తులు పడుతున్న బాధను ప్రపంచానికి చూపించారు. చుట్టూ పచ్చదనం ఉన్నా కూడా ఉద్దానం ప్రజల జీవితాలు కిడ్నీ వ్యాధుల కారణంగా ఎలా మోడు వారుతున్నాయో వెలుగులోకి తెచ్చారు. ఆ కన్నీటి గాథలు ప్రతి గుండెను తాకాయి. కళ్ళు చమర్చేలా చేశాయి. అప్పటికీ టీడీపీ (TDP) ప్రభుత్వం అధికారంలో ఉండి ఉద్ధానం వాసుల కిడ్నీ కష్టాలను తీర్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై నాటి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు కూడా.
వైయస్ఆర్ కాంగ్రెస్ హయాంలో
అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉద్దానం గ్రామస్తుల కన్నీటి గాథలను తెలుసుకొంది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్దానం గ్రామస్తులకు ప్రభుత్వ భరోసా లభించింది. రూ.700ల కోట్లతో రక్షిత మంచినీటి పథకం వారికి అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులను నయం చేసే లక్ష్యంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ - సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Super speciality hospital) నిర్మాణం జరిగింది. హాస్పిటల్ నిర్మాణం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రభుత్వం సుమారు రూ.85 కోట్లను వెచ్చించింది. అలా ఉద్దానం వాసులకు కిడ్నీ వ్యాధుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలను తీసుకుంది. అయితే ప్రస్తుతం ఉద్దానం గ్రామం రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు ఆయుధంగా మారింది. టీడీపీ ప్రభుత్వం ఉద్దానం ప్రజల కోసం ఏం చేయడం లేదంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అదే విధంగా తమ ప్రభుత్వ పాలనలో ఆ గ్రామం కోసం ఎన్నో చేశామని ఒక డాక్యుమెంటరీ (Documentary) వీడియోనికూడా విడుదల చేసింది. టీడీపీ ప్రభుత్వం కొత్తగా చేసిందేమిటని అడుగుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకే మెరుగులు దిద్ది తమ సొంత పనులుగా ప్రచారం (Publicity) చేసుకుంటున్నారని అంటున్నారు.
ప్రస్తుత కూటమి పాలనలో
చంద్రబాబు నాయుడు రెండోసారి అధికారం చేపట్టాక కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్దానం గ్రామస్తుల కోసం ఎన్నో చేశారని ఆ పార్టీ మద్ధతుదారులు చెబుతున్నారు. 6 డయాలసిస్ కేంద్రాలు నిర్మించారని, 2761 మందికి నెలకు రూ.2500లు పింఛను ఇస్తున్నారని, 7 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని టీడీపీ మద్ధతుదారులు అంటున్నారు. అంతేకాకుండా గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు చేయడమే కాకుండా మందులను కూడా ఉచితంగా అందిస్తోందని చెబుతున్నారు. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థ భాగస్వామ్యంతో కిడ్నీ వ్యాధుల నివారణకు పరిశోధన (Research) చేస్తోందని అంటున్నారు. 200 పడకల హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి 4.50 ఎకరాలను కేటాయించడమే కాకుండా భూసేకరణ చేపట్టి, నిధులు కేటాయించిందని పేర్కొంటున్నారు. అయితే అవన్నీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని ఆ పార్టీ మద్ధతుదారులు చెబుతున్నారు. ఇలా పరస్పర విమర్శలతో ఉద్దానంవాసులకు మేమంటే కాదు మేము మంచి చేశామని వాదించుకుంటున్నారు.
గుంటూరు తుర్కపాలెం మెడికల్ ఎమర్జెన్సీ
గత సెప్టెంబరులో గుంటూరు (Guntur) జిల్లాలోని తుర్కపాలెంలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రభుత్వం విధించింది. అప్పటికే రెండు నెలల్లో 20 మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. గుర్తు తెలియని వ్యాధి కారణంగా కిడ్నీలు (Kidney) దెబ్బతిన్నాయని, కండరాల బలహీనత ఏర్పడిందని ఇతర వ్యాధులు వచ్చాయని వైద్యులు తెలిపారు. అయితే వాస్తవంలో ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. నిజంగానే కాలుష్యం, అపరిశుభ్రత కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలా, మరింకేదైనా కారణమా అనే విషయాలు వెలుగులోకి వస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తుర్కపాలెంను సందర్శించిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటువంటి సమస్యలపై రాజకీయ పార్టీలు చర్చలు చేసి ముందస్తు చర్యలతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






