ఆదాయానికి మించిన ఆస్తుల కేసు : శాంతికి మరోసారి కస్టడీ

by Naga Rani Yarlagadda |

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు : శాంతికి మరోసారి కస్టడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ప్రస్తుతం సస్పెండ్) కె. శాంతిని ఏసీబీ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం ఆమెను రెండోసారి రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఏసీబీ అధికారులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం ఆమె ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై నమోదైన కేసులో విజయవాడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

వాస్తవానికి.. ఏసీబీ అధికారులు గతంలోనే ఆమెను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే ఆ సమయంలో శాంతి అధికారుల ప్రశ్నలకు సరిగ్గా స్పందించలేదని, విచారణకు ఏమాత్రం సహకరించలేదని ఏసీబీ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అక్రమ ఆస్తుల మూలాలు, బినామీల వివరాలను రాబట్టడానికి ఆమెను మరికొంత కాలం విచారించాల్సిన అవసరం ఉందని కోరుతూ అధికారులు రెండోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఏసీబీ కోర్టు, అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రెండో విడత విచారణలోనైనా అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు లేదా మరేవైనా రహస్య పెట్టుబడుల వివరాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. దేవాదాయ శాఖలో అత్యంత ప్రభావవంతమైన అధికారిణిగా పేరున్న శాంతి చుట్టూ ఇప్పుడు ఏసీబీ ఉచ్చు మరింత బిగుస్తోంది.

Next Story