Tirumala Ghat Road Timings: తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణానికి టీటీడీ నిబంధనలు! టైమింగ్స్ ఇవే..

by Ramesh Naini |

తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే భక్తుల భద్రతతో పాటు అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుతం అమలులో ఉన్న ప్రయాణ సమయాలు, నిబంధనలను మరోసారి స్పష్టం చేసింది.

Tirumala Ghat Road Timings: తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణానికి టీటీడీ నిబంధనలు! టైమింగ్స్ ఇవే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే భక్తుల భద్రతతో పాటు అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుతం అమలులో ఉన్న ప్రయాణ సమయాలు, నిబంధనలను మరోసారి స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించేందుకు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఘాట్ రోడ్డు సమయాలు..

నాలుగు చక్రాల వాహనాలు (కార్లు, బస్సులు) తెల్లవారుజామున 3.00 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. అర్ధరాత్రి 12.00 నుంచి ఉదయం 3.00 గంటల వరకు ఘాట్ రోడ్డు పూర్తిగా మూసివేస్తారు. ద్విచక్ర వాహనాలకు ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. రాత్రి వేళల్లో అడవుల్లో జంతువుల సంచారం ఎక్కువగా ఉండటంతో బైక్‌లకు అనుమతి ఇవ్వడం లేదని టీటీడీ స్పష్టం చేసింది.

ప్రయాణ సమయ పరిమితులు (టైమ్ లాక్ రూల్స్)

ఘాట్ రోడ్డు ప్రయాణంలో అతి వేగాన్ని నియంత్రించేందుకు టీటీడీ ‘టైమ్ లాక్’ విధానాన్ని అమలు చేస్తోంది. టోల్ గేట్ వద్ద వాహన ప్రవేశ సమయాన్ని నమోదు చేస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు (అప్‌వర్డ్) కనీస ప్రయాణ సమయం 28 నిమిషాలు. తిరుమల నుంచి తిరుపతికి (డౌన్‌వర్డ్) కనీసం 40 నిమిషాలు పట్టాలి.

టోల్ గేట్ వద్ద జరిమానా..

నిర్దేశించిన సమయానికి ముందే గమ్యానికి చేరుకుంటే టోల్ గేట్ వద్ద జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల భక్తులు వేగం తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణించాలని టీటీడీ సూచించింది. ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాల నివారణతో పాటు భక్తుల సురక్షిత దర్శనానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Next Story