- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టు వస్త్రాల కొనుగోలుపై టీటీడీ దృష్టి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పట్టు వస్త్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పట్టు వస్త్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగా పట్టు వస్త్రాల సరఫరా కోసం విఆర్‌ఎస్ ఎక్స్ పోర్ట్స్ సంస్థకు కేటాయించిన టెండర్‌ను టీటీడీ రద్దు చేసింది. గత పదేళ్లుగా (2015 నుంచి 2025 వరకు) ఈ సంస్థ పట్టు వస్త్రాల పేరుతో రూ. 55 కోట్లకు పైగా విలువైన నకిలీ పాలిస్టర్ దుపట్టాలను సరఫరా చేసిందని టీటీడీ విజిలెన్స్ విచారణలో తేలింది. వీఐపీ భక్తులకు వేదాశీర్వచనం సమయంలో అందించే ఈ వస్త్రాలు తప్పనిసరిగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో ఉండాలనే నిబంధనను సంస్థ ఉల్లంఘించిందని టీటీడీ చెబుతోంది. దీనిపై బోర్డు చైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు విచారణను జరిపించారు. విఆర్ఎస్ ఎక్స్ పోర్టు సంస్థ సరఫరా చేసిన పట్టు వస్త్రాలకు ల్యాబ్ లో పరీక్ష చేయించారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ల్యాబ్ లో చేసిన పరీక్షల్లోనూ ఈ వస్త్రాలు పాలిస్టరేనని నిర్ధారణ అయ్యింది.దీంతో కొత్త పట్టు వస్త్రాల కొనుగోలుపై టీటీడీ దృష్టి సారించింది. నాణ్యమైన పట్టు వస్త్రాలను సేకరించి భక్తులకు అందజేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. నకిలీ పట్టు వస్త్రాల కారణంగా దేవాలయ పవిత్రతకు భంగం వాటిల్లినట్లు టీటీడీతో పాటు భక్తులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విఆర్ఎస్ సంస్థకు కేటాయించిన టెండర్లను టీటీడీ రద్దు చేసింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన స్కాంపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖకు సిఫారసు చేసింది. కొత్త టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి.. నూతన పట్టు వస్త్రాలు వచ్చే వరకు టీటీడీ వద్దనున్న పట్టు వస్త్రాలనే ఆశీర్వచనానికి వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా, నాణ్యత విషయంలో రాజీపడకుండా పట్టు వస్త్రాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలతో టీటీడీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నాం అన్నారు.






