పరకామణి చోరీపై మళ్లీ ఎఫ్ఐఆర్ వేయిస్తారు : భూమన కరుణాకర్ సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-22 06:43:21  IST  )

తిరుమల పరకామణి చోరీ కేసు, లడ్డూ నెయ్యి కల్తీ అంశాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరకామణి చోరీపై మళ్లీ ఎఫ్ఐఆర్ వేయిస్తారు : భూమన కరుణాకర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్ వేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఇందులో నిందితులుగా వైసీపీ నేతలను చేర్చేందుకు ఒక డీఎస్పీకి బాధ్యతలు కూడా అప్పగించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రెండ్రోజుల్లోనే దీనిపై మళ్లీ టీటీడీతో ఫిర్యాదు చేయిస్తారని తమకు సమాచారం అందిందన్నారు. తిరుపతి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసులో ఇప్పటికే ఇద్దరు డీజీ స్థాయి అధికారులు విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత.. అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడిన ఒక డీఎస్పీ స్థాయి అధికారికి మళ్లీ విచారణ బాధ్యతలు అప్పగించి తమకు కావలసిన విధంగా నివేదిక తయారు చేయించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలే టార్గెట్ గా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.

సుప్రీం చేతిలో మొట్టికాయలు ఖాయం

అలాగే తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడం, అవహేళన చేయడమేనన్నారు. సుప్రీంకోర్టు వేసిన సిట్ విచారణపై నమ్మకం లేదన్నట్టుగా ఏకసభ్య కమిషన్ వేశారని, చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కచ్చితంగా తప్పుపడుతుందని జోస్యం చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు చేతిలో మొట్టికాయలు వేయించుకుంటారన్నారు.

మండలిలోకి వైసీపీ సభ్యులు దేవుడి చిత్రపటాలను తీసుకెళ్లడంపై జరుగుతున్న రాద్దాంతంపై భూమన స్పందించారు. దేవాలయం వంటి శాసనసభ, మండలిలోకి దేవుడి ఫొటోలను ఎందుకు తీసుకెళ్లకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకునే శ్రీవారి విగ్రహాలను పలువురికి గిఫ్టులుగా ఇచ్చారని, అప్పుడు తప్పు కానిది, ఇప్పుడెందుకు తప్పవుతుందని ప్రశ్నించారు.

Next Story