శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-22 14:47:34  IST  )

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల (Tirumala Brahmotsavams) ఏర్పాట్లపై టీటీడీ (TTD) ఈఓ జె.శ్యామలరావు అన్నమయ్య భవన్లో (Annamayya Bhavan) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల (Tirumala Brahmotsavams) ఏర్పాట్లపై టీటీడీ (TTD) ఈఓ జె.శ్యామలరావు అన్నమయ్య భవన్లో (Annamayya Bhavan) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. బ్రహ్మోత్సవాల్లో తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, అన్నదానం, త్రాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా తిరుమలలో భక్తులకు కేటాయించే గదులన్నింటిలోనూ విద్యుత్ పనులు, ఇతర రిపేర్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. యాత్రికులకు ఇచ్చే వసతి సముదాయాల్లోనూ సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అన్నదానం కోసం.. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (Tarigonda Vengamamba) అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉండటం వల్ల మరో ప్రాంతంలోనూ అన్నప్రసాద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇక తిరుమల కొండపై ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లన్నింటిలోనూ ఫుడ్ క్వాలిటీని పరిశీలించి, భక్తులకు నాణ్యమైన, సంప్రదాయ భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రసాదాలను విక్రయించే కేంద్రాల్లోనూ అన్ని కౌంటర్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ ఈఓ ఆదేశించారు. కాగా.. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు తిరుమల ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 16న ఆలయ శుద్ధి జరగనుండగా.. సెప్టెంబర్ 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సెప్టెంబర్ 28న 6వ రోజు నిర్వహించే గరుడవాహనసేవకు భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసే పనిలో టీటీడీ నిమగ్నమై ఉంది.

Next Story