- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైకుంఠ ఏకాదశి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.. ఆఫ్‌లైన్ టికెట్లకు చెక్
తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశమయింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశమయింది. ఈ సమావేశంలో వైకుంఠ ఏకాదశి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఆఫ్ లైన్లో వైకుంఠద్వార దర్శన టికెట్లు ఇవ్వబోమని తెలిపారు. ఈ దర్శనాల కోసం వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. వైకుంఠ ద్వారదర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.
182 గంటల వైకుంఠ ద్వార దర్శనాల్లో 164 గంటలు సామాన్యులకే కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా తొలి 3 రోజులు శ్రీవాణి, రూ.300 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి3 రోజులకు ఈ-డిప్ ద్వారా టికెట్లను కేటాయిస్తామని, ఇందుకోసం నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. డిసెంబర్ 2న డిప్ ద్వారా టోకెన్లను కేటాయిస్తామన్నారు. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా టోకెన్లను జారీ చేస్తామని తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ రోజుకు 15 వేల రూ.300 దర్శన టికెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తామని స్పష్టం చేశారు. వైకుంఠ ద్వారదర్శనాలు జరిగే 10 రోజులపాటు ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని, మిగిలిన అన్ని బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.






