జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే నిజమైన సంతృప్తి: ఎమ్మెల్సీ నాగబాబు

by Malleboina Mahesh |

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కంటే 'జనసేన కార్యకర్త' అనిపించుకోవడంలోనే తనకు ఎంతో సంతృప్తి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు నాగబాబు స్పష్టం చేశారు.

జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే నిజమైన సంతృప్తి: ఎమ్మెల్సీ నాగబాబు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కంటే 'జనసేన కార్యకర్త' అనిపించుకోవడంలోనే తనకు ఎంతో సంతృప్తి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు నాగబాబు స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన ఎచ్చెర్ల పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన కార్యకర్తల జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జన సైనికులకు, వీర మహిళలకు సమాజంలో అత్యధిక గౌరవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జనసేన ప్రయాణంలో ముందుండి పనిచేసిన 2 వేల మందికి పైగా కార్యకర్తలకు, నాయకులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేక నామినేటెడ్ పదవులతో గౌరవించారని నాగబాబు తెలిపారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అత్యున్నత నాయకత్వ స్థాయికి ఎదిగే అవకాశం జనసేన పార్టీలోనే ఉంటుందని, పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచే నిబద్ధత, నిజాయితీ గల ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పారు.

ఎచ్చెర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: కూటమి ధర్మం పాటిస్తాం

ఎమ్మెల్సీ హోదాలో ఏదైనా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉన్నందున, తాను ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు నాగబాబు వెల్లడించారు. ఇకపై ఎక్కువ సమయం ఎచ్చెర్లలో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి, స్థానిక శాసనసభ్యులు ఎన్. ఈశ్వరరావు సహకారంతో ఎచ్చెర్ల అభివృద్ధి కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గంతో పాటు ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story