భారత పారిశ్రామిక ధ్రువతారకు ఘన నివాళులు : సీఎం

by Thanuru Gopichand |

భారత పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసి, తన దాతృత్వంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) జయంతి నేడు.

భారత పారిశ్రామిక ధ్రువతారకు ఘన నివాళులు : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసి, తన దాతృత్వంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) జయంతి నేడు. 1937 డిసెంబర్ 28న జన్మించిన ఆయన, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడమే కాకుండా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. భారత పారిశ్రామిక ధ్రువతారగా నిలిచిన రతన్ టాటాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఎక్స్ వేదికగా ఘన నివాళులు అర్పించారు. ఆయన జయంతిని (Birth Anniversary) పుసరస్కరించుకొని స్మరించుకున్నారు.

శ్రీ రతన్ టాటా జీ జయంతి సందర్భంగా ఆయనను హృదయపూర్వకంగా స్మరించుకుంటున్నాను. దార్శనిక పారిశ్రామికవేత్త, మానవత్వం ఉన్న నాయకుడు, ఆయన తన జీవితాన్ని వ్యాపార శ్రేష్ఠత, దాతృత్వానికి అంకితం చేశారు. ఆయన సమగ్రత, వినయం, సమాజం పట్ల నిబద్ధత మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయనకు నా వినయపూర్వకమైన నివాళులు. అని సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అంతర్జాతీయ స్థాయికి టాటా గ్రూప్

​రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ టీ వంటి విదేశీ కంపెనీలను కొనుగోలు చేసి భారత సత్తాను ప్రపంచానికి చాటింది. సామాన్యుడి కారు కలని నిజం చేస్తూ 'నానో'ను తీసుకువచ్చిన ఆయన దార్శనికత అద్భుతం. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, గొప్ప మానవతావాది. తన సంపాదనలో సింహభాగం విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించారు.

​భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది. నిరాడంబరత, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన రతన్ టాటా గారి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, ఆశయాలు నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉంటాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ప్రజలు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

Next Story