డోలీ మోతలో ఆస్పత్రికి గిరిజనుడు: రోడ్డు లేక కురుపాం గిరిజనుల అవస్థలు!

by Thanuru Gopichand |

ప్రభుత్వాలు మారుతున్నా, అభివృద్ధి నినాదాలు వినిపిస్తున్నా పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలం తోలుంగూడ గిరిజనుల (Tribals) కష్టాలు మాత్రం తీరడం లేదు.

డోలీ మోతలో ఆస్పత్రికి గిరిజనుడు: రోడ్డు లేక కురుపాం గిరిజనుల అవస్థలు!
X

దిశ, వెబ్ డెస్క్ : ​​ప్రభుత్వాలు మారుతున్నా, అభివృద్ధి నినాదాలు వినిపిస్తున్నా పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలం తోలుంగూడ గిరిజనుల (Tribals) కష్టాలు మాత్రం తీరడం లేదు. కనీస రహదారి సౌకర్యం లేక ఇక్కడి గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి చేర్చడానికి డోలీ మోత తప్పలేదని గిరిజనులు చెబుతున్నారు. ​కురుపాం మండలం, ఒబ్బంగి పంచాయతీ పరిధిలోని తోలుంగూడ గ్రామానికి చెందిన మండంగి కింబాపు అనే వృద్ధుడు గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో గ్రామస్తుడు మాట్లాడుతూ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ గ్రామం వరకు రాలేకపోతోందన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి రోగిని డోలీ కట్టి, దానిపై మోస్తూ సుమారు నాలుగు కిలోమీటర్లు దూరం అటవీ ప్రాంతంలో నడవాల్సి వస్తోందన్నారు. అయితే డోలీ మోతతో ప్రధాన రహదారి వరకు చేరుకున్నాక అక్కడి నుంచి వాహనంలో ఆస్పత్రికి తరలించిన పరిస్థితి నెలకొందని గిరిజనులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య బృందం కూడా వారిని పరామర్శించినట్టు సమాచారం.

​ఏళ్లుగా తప్పని కష్టాలు

​ఏళ్లు గడుస్తున్నా, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కలగకపోవడంతో తోలుంగూడ గిరిజనులు నిత్యం ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్యం అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని తోలుంగూడ గిరిజనులు కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. మౌలిక వసతులు లేక గిరిజనులు పడుతున్న ఈ దుస్థితిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజా సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story