సింహాచలంలో గోడ కూలిన ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక

by Naga Rani Yarlagadda |

సింహాచలం దేవస్థానంలో గోడకూలిన ఘటనపై ప్రాథమిక విచారణ ముగించిన త్రిసభ్య కమిటీ నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

సింహాచలంలో గోడ కూలిన ఘటనపై నేడు ప్రభుత్వానికి నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న దేవస్థానంలో (Simhachalam Temple) చందనోత్సవం జరుగుతుండగా.. ఏప్రిల్ 30న ఆలయం గోడకూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రాథమిక విచారణ పూర్తవ్వగా.. నేడు ప్రభుత్వానికి ఆ నివేదికను అందజేయనుంది. గోడకూలి భక్తులు మరణించిన దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో త్రిసభ్య కమిషన్ లోతుగా విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విశాఖ సర్క్యూట్ హౌస్ (Vizag Circuit House)లో 20 మందిని విచారించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.

కాగా.. ఆలన గోడ నిర్మాణం హడావుడిగా, నాణ్యత లేకుండా కట్టడం వల్లే ఇలా జరిగిందని విచారణ కమిటీ చైర్మన్ సురేశ్ కుమార్ వెల్లడించారు. గోడ డిజైన్, మెటీరియల్ విషయంలో కాంట్రాక్టర్ ఎలాంటి బాధ్యత తీసుకోలేదన్నారు. కూలిన గోడ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామన్నారు. మరోవైపు ప్రమాదంలో మరణించిన భక్తుల మృతదేహాలపై బంగార మాయమైందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన పోలీసులు.. ఇదంతా అసత్య ప్రచారమని, చనిపోయినవారి బంగారు నగలను వారి బంధువులకు అప్పగించినట్లు స్పష్టం చేశారు. సింహాచలం ఘటనపై ఇలాంటి దుష్ర్పచారాలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story