- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విషాదం.. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కాసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, శనివారం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు.
నాదెండ్ల జీవిత, రాజకీయ ప్రస్థానం..
నాదెండ్ల భాస్కరరావు 1935, జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1958లో ఆయన లలిత భాస్కరరావును వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుండగా.. మరో కుమారుడు వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నారు. భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1978 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుంచి 1982 వరకు నాదెండ్ల భాస్కరరావు.. మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు.
తెలుగుదేశంలో కార్చిచ్చు! నెల రోజులు సీఎంగా..
ఆ తదనంతర పరిణామాలతో తెలుగుదేశం పార్టీలో చేరిన నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ అమెరికాలోని టెక్సాస్‌లో గుండెకు ట్రిపుల్ బైపాస్ శస్త్రచికిత్స చేయించుకోవడానికి వెళ్లిన సమయంలో.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో తన వర్గ ఎమ్మెల్యేలతో నాదెండ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 11వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత 'ధర్మయుద్ధం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో నాదెండ్ల భాస్కరరావు సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వెంటనే అప్పటి గవర్నర్ రాంలాల్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. అదే సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన వెంటనే నాదెండ్ల భాస్కరరావు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరపున లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. వయోభారం కారణంగా గత కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.






