NTA: సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ, రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ (UG) 2026 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం విడుదల చేసింది.

NTA: సీయూఈటీ-యూజీ 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ, రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ (UG) 2026 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల విడుదలతో యూనివర్సిటీల్లో ప్రవేశాల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్ష కోసం మొత్తం 15.68 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, సుమారు 11.64 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే తాను ఎంచుకున్న ఐదు సబ్జెక్టుల్లో నాలుగింటిలో 100 పర్సంటైల్ సాధించడం గమనార్హం. వాస్తవానికి మే 31 నాటికి ముగియాల్సిన ఈ పరీక్షలు, బక్రీద్ పండుగ కారణంగా మే 31, జూన్ 6, జూన్ 7 తేదీలకు రీషెడ్యూల్ చేసి నిర్వహించారు.

మార్కులకు బదులుగా పర్సంటైల్ విధానం

వివిధ సెషన్లు, వేర్వేరు షిఫ్టుల్లో పరీక్షలు జరిగినందున.. అందరికీ న్యాయం జరిగేలా (Normalisation) NTA మార్కులకు (Raw marks) బదులుగా పర్సంటైల్ (Percentile) విధానాన్ని అమలు చేసింది.

స్కోర్‌కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి మార్కుల మెమోలను పొందవచ్చు. ఫలితాలు, స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్‌ http://cuet.nta.nic.in లో అందుబాటులో ఉన్నాయి.

Next Story