- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టిగడ్డలు పడి కోడలు మృతి, అత్త పరిస్థితి విషమం
మట్టిగడ్డలు పడి కోడలు మృతి చెందగా అత్త పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామ సమీపంలోని కట్లేరు వాగు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలి పనుల కోసం వెళ్లిన అత్తాకోడళ్లపై ఒక్కసారిగా మట్టిగడ్డలు విరిగిపడటంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఊపిరాడక ప్రాణాలు విడిచిన కోడలు
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అమ్మిరెడ్డిగూడెంకు చెందిన గుంజి ధనలక్ష్మి(30), ఆమె అత్త నాగలక్ష్మి కలిసి కట్లేరు వాగు వద్ద ట్రాక్టర్‌లో ఇసుక నింపే పనులకు వెళ్లారు. ఇసుకను లోడ్ చేస్తున్న క్రమంలో పక్కనే ఉన్న మట్టి దిబ్బ ఒక్కసారిగా వారిపై విరిగిపడింది. భారీగా మట్టిగడ్డలు మీద పడటంతో ధనలక్ష్మి మట్టి కింద కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న వయసులోనే ధనలక్ష్మి మరణించడంతో ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
అత్త నాగలక్ష్మి పరిస్థితి విషమం
మట్టిగడ్డల కింద చిక్కుకున్న నాగలక్ష్మిని గమనించిన తోటి కూలీలు, స్థానికులు వెంటనే ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగలక్ష్మి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న గంపలగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






