- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సులో దారుణంగా కొట్టుకున్న మహిళలు.. సీటు కోసమేనా ఈ రచ్చ?
ఏపీలో ఆర్టీసీ బస్సులో సీటుకోసం మహిళలు కొట్టుకోవడం ఓ బాలిక ప్రాణాలమీదికి వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయంలో ఉంది.

దిశ, వెబ్‍డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సులు ఎక్కడలేని కష్టాలు తీసుకొచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం అందించే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు. అందులోనే బస్సు స్టాప్ లో ఆగడం పాపం.. విండో సీటు కోసం పరుగులు పెడుతున్నారు. సీట్లు దొరక్కపోయినా, ఒకేసారి ఇద్దరు, ముగ్గురు ఒకే సీటుకోసం పరుగుపెట్టి దొరక్కపోయినా.. ఇంకంతే.. ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పదుల సంఖ్యలో కిక్కిరిసి ఉన్న బస్సులోనే జుట్టుజుట్టు పట్టుకుని పరస్పరం పిడిగుద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. ఆ గొడవను బస్సులో ఉన్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది.
జిల్లాలోని బొబ్బిలి వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో గురువారం రాత్రి ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన గొడవ రెండు వర్గాలుగా మారి కొట్టుకునేవరకూ దారితీసింది. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలికకు తీవ్రగాయాలయ్యాయి. ఒకసీటు కోసం ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన వాదన.. మాటలయుద్ధం నుంచి చేయి చేసుకునేవరకూ వెళ్లింది. తోటి ప్రయాణికులు వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా బిత్తరపోయి చూస్తుండిపోయారు. ఇద్దరి మధ్య గొడవ కాస్తా.. అటు నలుగురు, ఇటు నలుగురు చేసేసరికి రెండువర్గాల మధ్య గొడవగా మారింది. ఈ క్రమంలో ఓ మహిళ 14 ఏళ్ల బాలికపై చేయి చేసుకుంది. దీంతో ఆ బాలిక కిందపడిపోగా.. పలువురు ఆమె మీదినుంచీ వెళ్లడంతో అస్వస్థతకు గురై ఊపిరాడలేదు. వెంటనే తల్లిదండ్రులు, ప్రయాణికులు స్థానిక పీహెచ్సీకి 108 ద్వారా తరలించగా.. అక్కడ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
విశాఖకు చెందిన బెజ్జుపల్లి భార్గవి (14) తన పేరెంట్స్ తో కలిసి బొబ్బిలి గొల్లవీధిలోని మేనమామ ఇంటికి.. దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల పండక్కి వచ్చింది. పండుగ పూర్తి కావడంతో గురువారం సాయంత్రం తిరిగి విశాఖ వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లి తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఆర్టీసీ బస్సెక్కింది. ఆ తర్వాత ఈ గొడవ జరిగి తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.






