జమ్మలమడుగు వద్ద టూరిస్టు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

by Ramesh Naini |

కడప జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలం అంబవరం క్రాస్‌రోడ్ వద్ద ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

జమ్మలమడుగు వద్ద టూరిస్టు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కడప జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలం అంబవరం క్రాస్‌రోడ్ వద్ద ఓ టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది పర్యాటకులు సోమవారం ఉదయం ఆలయాల సందర్శన నిమిత్తం టూరిస్టు బస్సులో బయలుదేరారు. ముందుగా కన్యతీర్థం చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న వీరు, అనంతరం మైలవరం మండలంలోని రంగనాయకుల కోనకు ప్రయాణమయ్యారు.

ఊడిపోయిన స్టీరింగ్..

బస్సు అంబవరం క్రాస్‌రోడ్ సమీపానికి చేరుకోగానే, సాంకేతిక లోపంతో ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ ఊడిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి, జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, మెరుగైన చికిత్స నిమిత్తం వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story