- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ‘అజ్ఞాత అద్భుతాల’ ఆవిష్కరణ.. పర్యాటక శాఖ వినూత్న ప్రయోగం
రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఒక విశిష్ట పర్యాటక కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని ఒక విశిష్ట పర్యాటక కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాటల పర్యవేక్షణలో ‘వాలంటీర్ యాత్ర’ సంస్థతో కలిసి చేపట్టిన వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ అనూహ్య ఫలితాలను సాధించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
విషయంలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రాష్ట్రంలోని అపురూపమైన పర్యాటక ప్రాంతాలను, గ్రామీణ సంస్కృతిని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు 'వాలంటీర్ యాత్ర' సంస్థతో కలిసి చేపట్టిన కార్యక్రమం అద్భుత ఫలితాలు సాధించింది. కేవలం వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా క్షేత్రస్థాయి అనుభవాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
మొదటి దశ పర్యాటక ప్రయాణం..
రెండు దశల్లో సాగిన పర్యాటక ప్రయాణం సత్ఫలితాలనిచ్చింది. ఢిల్లీ, రాజస్థాన్, అస్సాం, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు 11 మంది ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మొదటి దశలో 2025 డిసెంబర్ 13 నుంచి 20 వరకు వారం రోజుల పాటు విశాఖపట్నం – అరకు వ్యాలీ – లంబసింగి ప్రాంతాల్లో పర్యటించారు. వీరి ద్వారా సుమారు 80-100 అత్యుత్తమ నాణ్యత కలిగిన వీడియోలు, డ్రోన్ షాట్లు, సినిమాటిక్ ట్రావెల్ ఫిల్మ్స్ తో రూపొందిన కంటెంట్ వీడియోలు సుమారు 40 లక్షల మందికి పైగా వీక్షకులను ఆకట్టుకున్నాయి.
రెండో దశ పర్యాటక ప్రయాణం..
2026 జనవరి 13వ తేదీ నుంచి 17 వరకు కోనసీమ సంక్రాంతి సంబరాలు, పండుగ వైభవాన్ని చాటిచెప్పేలా కోనసీమలో రెండో దశ పర్యటన సాగింది. అయోధ్య, కోల్‌కతా, ముంబై, ఒడిశా వంటి నగరాల నుంచి వచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్లు భోగి మంటలు, ప్రభల తీర్థం, స్థానిక ఆచారాలను స్వయంగా అనుభవించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆత్రేయపురం, అంతర్వేది, రాజమండ్రి వంటి ప్రాంతాల అందాలను వీరు అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ దశలో కేవలం 30 రీల్స్ ద్వారానే 5 మిలియన్ల వ్యూస్ లభించాయి. ప్రధానంగా కోనసీమ ప్రభల తీర్థాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
ఆర్థికంగా ఊతమిస్తున్న కొత్త నమూనా..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో పర్యాటక శాఖ అధికారులు సాంప్రదాయ భారీ ప్రకటనల ఖర్చు లేకుండా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా చేపట్టిన ఈ ప్రచారం వల్ల గత నెల రోజుల్లోనే 1,000కి పైగా బుకింగ్ ఎంక్వైరీలు సాధించారు. వీటిని వెంటనే రాష్ట్రంలోని రిజిస్టర్డ్ టూర్ ఆపరేటర్లకు బదిలీ చేయడం ద్వారా స్థానిక హోమ్‌స్టేలు, గిరిజన గైడ్లు మరియు స్థానిక కళాకారులకు నేరుగా ఉపాధి లభించింది. తద్వారా పర్యాటక శాఖ అత్యంత నాణ్యమైన కంటెంట్ బ్యాంక్‌ను రూపొందించుకోవడే గాక స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలిచింది.
భవిష్యత్ ప్రణాళిక..
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా 'ఆర్ట్ విలేజ్‌ల' (కళా గ్రామాలు) అభివృద్ధికి, హోమ్‌స్టే నెట్‌వర్క్ విస్తరణకు పర్యాటక శాఖ, వాలంటీర్ యాత్ర సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు విశాఖ సర్క్యూట్ లో 80, కోనసీమ సర్క్యూట్ లో 30 మొత్తంగా 11 వీడియోలు రూపొందించగా 9 మిలియన్లకు పైగా ప్రజలు వీటిని వీక్షించడం విశేషం. ఈ క్రమంలో వచ్చిన రెస్పాన్స్ ను చూసి రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుత ప్రదేశాలను ఈ తరహాలోనే ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యాటక విశేషాలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో వీక్షించవచ్చని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.






