- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టమాటా పంట.. కన్నీరే రైతు కంట..! సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ధరలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా (Tomato) రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నెల రోజుల క్రితం వరకు ఆశాజనకంగా ఉన్న ధరలు ఒక్కసారిగా సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పత్తికొండ (Pattikonda), ప్యాపిలి (Pyapili) మార్కెట్లలో టమాటా ధరలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ కిలో టమాటా కేవలం రూ.4 నుంచి రూ.5 వరకు మాత్రమే పలుకుతోంది. గత నెలలో రూ.30 నుంచి రూ.40 వరకు పలికిన ధరలు ఇలా ఒక్కసారిగా పడిపోవడంతో రైతులకు ఏ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కొందరు రైతులు గిట్టుబాటు ధర లేక పంటను మార్కెట్‌కు తీసుకురాకుండా పొలాల్లోనే వదిలేస్తుండగా మరికొందరు రోడ్లపైన పారబోసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
అతపెద్ద మార్కెట్ మదనపల్లిలోనూ అంతే..
ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లి (Madanapally)లో కూడా ధరల పతనం కొనసాగుతోంది. నాణ్యతను బట్టి కిలో రూ.8 నుంచి రూ.13 మధ్య సేల్ అవుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు తగ్గడం, స్థానికంగా దిగుబడి పెరగడం ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా తెలంగాణలోని పలు రైతు బజార్లలో రూ.10 చొప్పున క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఓ వైపు రైతు దగ్గర కేవలం రూ.5 లకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, బహిరంగ మార్కెట్‌లో మాత్రం సామాన్య వినియోగదారుడికి రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. రైతుకు లాభం లేక, అటు వినియోగదారుడికి తక్కువ ధరకే దొరకక.. మధ్యలో దళారులు మాత్రమే లాభపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
పంటకు పెట్టుబడి లక్షల్లో పెట్టామని.. ఇప్పుడు వందల్లో కూడా రాబడి రావట్లేదని తెలుగు రాష్ట్రాల్లోని టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు బజార్ల ద్వారా నేరుగా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించి తమను తక్షణమే ఆదుకోవాలి ఆవేదన వ్యక్తం చేశారు.






