తిరుపతి - సాయినగర్ షిర్డి నూతన వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం!

by Thanuru Gopichand |

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి - షిర్డి మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది.

తిరుపతి - సాయినగర్ షిర్డి నూతన వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం!
X

దిశ, వెబ్ డెస్క్ : ​ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి - షిర్డి మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీని పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ ఈ చర్యతో మరో ముందడుగు వేసింది. రెండు ముఖ్యమైన క్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి - సాయి నగర్ షిర్డి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును (Tirupati- Sainagar Shirdi Weekly Express) వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి వి. సోమన్న ఈ నూతన రైలు సేవను వర్చువల్‌గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండవ వీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే, ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ రఘునాథరెడ్డి గారు వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

​ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా సాయి నగర్ షిర్డి చేరుకుంటుంది. తద్వారా మార్గమధ్యంలో ఉన్న భక్తులకు కూడా షిర్డి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరతాయని, ముఖ్యంగా వారాంతాల్లో పర్యటించే ప్రయాణీకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించినట్టయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story