- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ సాగుపై ఉద్యాన శాఖ గైడ్‌లైన్స్
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, తొలకరి జల్లులకే సాగు చేయవద్దని ఉద్యాన శాఖ హెచ్చరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ వానకాలం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రైతులు వరి పంటను తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, యూరియా అందుబాటులో ఉంచి వరుణుడి కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది రైతులు తొలకరి జల్లులకే పత్తి విత్తనాలు వేస్తున్నారు. అయితే తొలకరి జల్లులను చూసి పంటలు వేయద్దని రెండు, మూడు వర్షాలు పడిన తరువాతే సాగు చేయాలని ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలు సాగు చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన దిగుబడి సాధించి వచ్చని చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. దేశవ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో వర్షపాతంలో అసమానంగా, హెచ్చుతగ్గులు ఉండే చాన్స్ ఉంది. తెలంగాణ మధ్య జిల్లాల్లో సాధారణం లేదా ఎక్కువ వర్షపాతం.. ఉత్తర, దక్షిణ జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో రైతులు సాగు నష్టాలను తగ్గించుకోవడానికి, పంటల సాగు కొనసాగించడానికి ప్రత్యామ్నాయ పంట నిర్వహణ వ్యూహాలు అత్యవసరమని ఉద్యాన వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
నీటి కుంటల ఏర్పాటు..
రైతులు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే నేలలో విత్తనం వేయాలి. నీటి సంరక్షణ కోసం ఎత్తైన బెడ్లు, మల్చింగ్, పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్, ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యం పెంచాలి. పశువుల ఎరువు, వెర్మికంపోస్ట్, వేప చెక్కలు వంటి సేంద్రియ ఎరువులు వాడి నేల తేమను నిల్వ చేయాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా పురుగులు, శిలీంద్రాలను నియంత్రించాలి. సాధ్యమైన ప్రతి చోట ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. పండ్ల విషయంలో మామిడి, జామ, సీతాఫలం వంటి పంటల్లో కత్తిరింపు, డ్రిప్ ఇరిగేషన్, పొటాషియం నైట్రేట్, బోరాన్‌తో కలిపి పిచికారీ చేయాలి. నారింజ, నిమ్మ, బత్తాయి పంటల్లో మల్చింగ్, కత్తిరింపులు, నత్రజని, భాస్వరం, పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయడం ద్వారా పండ్ల నాణ్యత మెరుగుపడుతుంది.
తోట పంటలకు జాగ్రత్తలు..
ఆయిల్ పామ్ పంటల్లో మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, మేలైన నీటి యాజమాన్యం పద్ధతులు అనుసరించాలి. అరటి పంటల్లో పశువుల ఎరువు, మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్, శిలీంద్ర రహిత పిలకలు వాడి వేడి తీవ్రతను నివారించాలి. కోకో పంటల్లో షేడ్ నియంత్రణ, మల్చింగ్, శిలీంద్ర నాషన్లు పిచికారీ చేయాలి. కొబ్బరి పంటల్లో వర్షపు నీటి నిల్వ, మల్చింగ్, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, డ్రైనేజ్, తరచుగా నీటి తడులు ఇవ్వాలి. అదేవిధంగా వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో స్వల్ప కాలిక రకాలు నీటి ఎద్దడిని తట్టుకునే కూరగాయలు సాగు చేసుకోవాలి. టమోటా (అర్క వికాస్, అర్క రక్షక్), వంకాయ (శ్యామల, భాగ్యమతి), మిర్చి (తేజ, ఎల్‌సీఏ 334), బెండకాయ (అర్క అనామికా, లలిమా), మునగ (పీకేఎం1, పీకేఎం 2), క్లస్టర్ బీన్ (పూసా నవభార్), బొబ్బర్లు (అర్క గరిమా), పందిరి కూరగాయల్లో (కాకర, బీర, సొర, దోస), పాలకూర (ఆల్ గ్రీన్, అర్క అనుపమా) వంటి రకాల పంటలు అనుకూలం. ఔషధ, సుగంధ ద్రవ్య పంటలైన పుదీనా, లెమన్ గ్రాస్, అలోవెరా వంటి పంటల్లో మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్, సల్ఫేట్ ఆఫ్ పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయాలి.
మసాలా పంటల సాగు..
మిర్చి, పసుపు, ధనియాలు వంటి పంటల్లో నీటి ఎద్దడిని తట్టుకునే రకాల వాడాలి. మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదా పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయాలి. వీటికి సంబంధించి కూడా స్వల్పకాలిక రకాలు, నీటి ఎద్దడిని తట్టుకుని పంటలు ఎంచుకోవాలి. నీటి ఎద్దడిని, అధిక వేడిని తట్టుకునేందుకు పైపాటుగా పిచికారీ చేయాలి. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు, సలహాలు అందించాలని, హార్టికల్చర్, ఇరిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల సమన్వయం అవసరమని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డి.రాజిరెడ్డి సూచించారు.






