- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీభవన్‌లో మంత్రుల ముఖాముఖికి బ్రేక్.. మళ్లీ మొదలయ్యేది ఎన్నడో?
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమానికి బ్రేక్ పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా గాంధీభవన్ లో నిర్వహించే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి కొద్ది రోజులుగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేందుకు ‘మంత్రులతో ముఖాముఖి’ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారంలో ఒకరోజు గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి, అటు ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం చేపడుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. 2024 అక్టోబర్ లో కార్యక్రమం ప్రారంభంకాగా, మంత్రులు పాల్గొన్నారు. వారంలో ఒకటి లేదా రెండు సార్లు వచ్చి ప్రజలు, కార్యకర్తల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి పరిష్కరించేశారు. లేకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారు. భూవివాదాలు, ఉద్యోగ అవకాశాలు, సీనియర్ సిటిజన్ల సమస్యలు, స్థానిక అంశాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. సమస్యలను మంత్రులు శ్రద్ధగా విని వాటి పరిష్కారానికి చొరవ చూపేవారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో కార్యక్రమం సైతం సక్సెస్ అయింది. ఏఐసీసీ పెద్దలు టీపీసీసీ నేతలను అభినందించారు.
మంత్రుల షెడ్యూల్ బిజీబీజీ..
హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లోనూ కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు రాష్ట్రనేతలకు సూచించారు. అయితే మంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగా ముఖాముఖి కార్యక్రమానికి మధ్యలో బ్రేక్ పడింది. అనంతరం కొన్ని వారాల తర్వాత మళ్లీ ప్రారంభమైంది. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు, మధ్యలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రావడంతో ముఖాముఖి కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో పాటు రాజకీయ వ్యవహారాల్లో మంత్రుల బిజీ అయ్యారు. కార్యక్రమం మళ్లీ ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా పార్టీవర్గాల్లో స్పష్టత లేదు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందని, వీలైనంత త్వరలో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే వచ్చే ఎన్నికల నాటికి మంచి పునాది పడేలా తయారవుతుందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.






