తిరుపతి లడ్డూ కేసులో మరో ఇద్దరు అరెస్టు

by Bhanu |   (  Updated:2025-04-28 10:19:27  IST  )

తిరుపతి లడ్డూ కల్తీ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మరో ఇద్దరిని అరెస్టు చేసింది.

తిరుపతి లడ్డూ కేసులో మరో ఇద్దరు అరెస్టు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లడ్డూ కల్తీ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) మరో ఇద్దరిని అరెస్టు చేసింది. భోలే బాబా డెయిరీకి చెందిన ఆశిష్, మరొక వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం వారిద్దరికీ తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని విచారణ కోసం బాలాజీ బస్టాండ్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జాయింట్ డైరెక్టర్, ఎస్పీలతో సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్ బృందం తిరుపతిని కేంద్రంగా చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేసింది.

దర్యాప్తులో భాగంగా సిట్ బృందం రెండు నెలల పాటు ఉత్తరాఖండ్‌లోని భోలే బాబా డెయిరీలో ఉండి వివరాలు సేకరించింది. అనంతరం ఈ ఇద్దరిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వారిని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. విచారణలో తేలిన వివరాల ప్రకారం, భోలే బాబా డెయిరీలో నెయ్యిని కల్తీ చేసి, తిరుపతి సమీపంలోని వైష్ణవి డెయిరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సరఫరా చేశారు. ఈ వ్యవహారంలో డెయిరీ యాజమాన్యం , టీటీడీ అధికారుల పాత్రపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.


Next Story