Tirupati | ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద హిందూ సంఘాల ఆందోళన

by Thanuru Gopichand |

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (SV Polytechnic) వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.

Tirupati | ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద హిందూ సంఘాల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్ : ​తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (SV Polytechnic) వద్ద హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాల మరోసారి మతపరమైన వివాదంలో చిక్కుకుంది. కళాశాలలో విద్యార్థులకు ఓ మతానికి చెందిన బోధనలు చేస్తున్నారంటూ హిందుత్వ సంఘాలు, బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్‌ (VHP) కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యా సంస్థల్లో మత ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తరగతి గదిలో మతపరమైన పాఠాలు చెబుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వ విద్యాసంస్థలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థులను మతపరమైన కార్యకలాపాల్లోకి ఆకర్షించేలా మత సంబంధిత అంశాలను బోధించడం శాంతిపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసే చర్య అని వారు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. మతపరమైన ప్రచారం చేస్తున్న వారిని కేవలం సస్పెండ్ చేయడమే కాకుండా, వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందుత్వ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

​ఈ ఘటన రాష్ట్రంలో మతపరమైన ప్రచారాలకు సంబంధించిన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పవిత్రమైన విద్యాసంస్థల్లో మతపరమైన అంశాలను బోధించడం తీవ్ర అభ్యంతరకరమని ఆందోళనకారులు పేర్కొన్నారు. లెక్చరర్ మాధవిపై కళాశాల యాజమాన్యం, విద్యాశాఖ తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులు హెచ్చరించారు. క్లాస్ రూమ్‌లలో మత ప్రచారం జరుగుతున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎంత త్వరగా పరిష్కరిస్తుందో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story