తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా ఆర్జిత సేవ టికెట్లు విడుదల

by Thanuru Gopichand |

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.

తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా ఆర్జిత సేవ టికెట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవ టికెట్ల (Arjitha Seva Tickets) కోటాను నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో భాగంగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి విశిష్ట సేవలను ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ పద్ధతిలో కేటాయించనున్నారు. భక్తులు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత రుసుము చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాలని టీటీడీ సూచించింది.

మరిన్ని సేవా టికెట్ల విడుదలకు సంబంధించి టీటీడీ స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి టికెట్లను విడుదల చేయనున్నారు. జనవరి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జనవరి 24న ఉదయం 10 గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story