- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు పెట్రోల్ బంకులు సీజ్.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపడుతున్న వారిపై పల్నాడు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన మూడు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు.
యాజమాన్యాలపై కలెక్టర్ ఆగ్రహం
రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలోనూ గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ బంకు వద్ద చూసినా ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. సరిగ్గా ఈ విపత్కర పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని ఫిల్లింగ్ స్టేషన్లు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తక్షణమే కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మూడు పెట్రోల్ బంకులను అధికారులు సీజ్ చేశారు. నరసరావుపేటలో శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలో జనతా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా మూడు బంకులపై చర్యలు తీసుకోవడంతో జిల్లాలోని ఇతర పెట్రోల్ బంకుల యాజమాన్యాల్లో కలవరం మొదలైంది.






