రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం

by Thanuru Gopichand |

రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.

రాజధాని రైతుల సమస్యలపై  త్రిసభ్య కమిటీ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. అందుకోసం త్రిసభ్య కమిటీని నియమించింది. రాజధాని అమరావతి రైతుల సమస్యల (Farmers Issues) పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నేడు మరోసారి సమావేశం కానుంది. రాజధాని రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రవణ్‌ కుమార్‌తో కూడిన త్రిసభ్య కమిటీ చర్చించనుంది. ఇప్పటికే రెండుసార్లు త్రిసభ్య కమిటీ భేటీ అయిన విషయం విదితమే. నేడు ఉదయం 10 గంటలకు మరోసారి సీఆర్డీఏ (CRDA) ఆఫీస్‌లో రైతుల సమస్యలపై సమావేశం కానుంది.

ఈ సమావేశాల్లో జరీబు-మెట్ట భూముల అంశం, గ్రామ కంఠాలు, అసైన్డ్‌, లంక భూముల రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలియ వస్తోంది. రైతు సమస్యలకు ​త్వరలో పరిష్కారం సాధించడమే లక్ష్యంగా కమిటీ భేటీ అవుతోంది. వీలైనంత త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించాలని కమిటీ కృషి చేస్తోంది. ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్లకు హద్దు రాళ్లు వేయడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాజధాని ప్రాంతంలో వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఆరు నెలల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ సభ్యులు గతంలో హామీ ఇచ్చిన విషయం విదితమే. అందులో భాగంగానే తరచూ సమావేశాలను నిర్వహిస్తోంది. భిన్నాభిప్రాయాలను సేకరించడం, ప్రతిపాదనలను పరిశీలించడం వంటివి చేస్తోంది. వాటిపై త్రిసభ్య కమిటీ చర్చించి నివేదికలను రూపొందిస్తోంది. వాటిని ప్రభుత్వం ముందు ప్రస్తావిస్తూ తగిన చర్యలు తీసుకునేలా చూస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ త్రిసభ్య కమిటీ పని చేస్తోంది. ఆయన సలహాలు, సూచనల మేరకు రైతు సమస్యల పరిష్కారానికి పని చేస్తోంది.

ఆంధ్రుల రాజధాని అమరావతి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక దృష్టిని సారించారు. ఆయన ఇటీవల రాజధాని రైతులతో సమావేశం అయ్యారు. వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. శుక్రవారం జరిగిన బ్యాంక్ భవన నిర్మాణాల ప్రారంభోత్సవంలో కూడా రాజధాని రైతుల త్యాగాన్ని ఆయన కొనియాడిన విషయం విదితమే. అమరావతి రైతులు స్వచ్ఛందంగా భూములను ఇచ్చి ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అంశంలో ప్రత్యేకత కనబరిచారని కొనియాడారు. వారికి ఎటువంటి నష్టం జరగకుండా.. అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై నేడు జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మూడో సమావేశంలో రైతుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి సంబంధించి కమిటీ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Next Story