- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు సాక్ష్యం ఇదే.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని, ఆయన చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం విశాఖ మేయర్ ను పదవి నుంచి దించడమేనని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM Jagan Mohan Reddy) ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని, ఆయన చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం విశాఖ మేయర్ ను పదవి నుంచి దించడమేనని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM Jagan Mohan Reddy) ఆరోపించారు. విశాఖ మహా నగరపాలక సంస్థ మేయర్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో జీవీఎంసీ మేయర్ (GVMC Mayor) పదవి కూటమి నేతల చేతిలోకి వెళ్లింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన జగన్.. సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై సంచలన విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం మీ దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని మండిపడ్డారు. అలాగే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్ (Vizag Corporation)లో వైయస్సార్‌సీపీ (YSRCP) గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ (TDP) కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందని, మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది? అని ప్రశ్నించారు.
బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగంచేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారని తెలిపారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి.. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అని నిలదీశారు.
అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? ఇది అధికార దుర్వినియోగం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసి, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారని, మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు.
ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లను, వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ అని వైసీపీ నేత రాసుకొచ్చారు.






