నన్ను ప్రపంచ బ్యాంక్ జీతగాడని అన్నారు.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-13 14:53:04  IST  )

ఐదేళ్ల వైసీపీ పాలనలో సరైన విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు.

నన్ను ప్రపంచ బ్యాంక్ జీతగాడని అన్నారు.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ పాలనలో సరైన విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో రైతులు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారని ఆరోపించారు. ఇక నుంచి వ్యవసాయానికి 9 గంటల కరెంట్ పగలే ఇస్తామని తెలిపారు. 2011లో తాను పాదయాత్ర చేశానని.. కరెంట్ కోసం అన్నదాతలు పడుతోన్న కష్టాలు తన దృష్టికి వచ్చాయనొ పేర్కొన్నారు. అనంతరం తాము అధికారంలోకి రాగానే విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. అదే సమయంలో ప్రపంచ బ్యాంక్ జీతగాడు అంటూ తనను విమర్శించారని గుర్తు చేశారు.

ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజల కోసం భరించానని అన్నారు. విద్యుత్ సంస్కరణలు తెచ్చి మొట్టమొదటి రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. 2003లోనే కరెంట్ కోరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చామని అన్నారు. ఆ పరిణామంతో రాష్ట్రానికి లాభాలు వచ్చాయని, కొన్ని నష్టాలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. 2004లో టీడీపీ ఓడిపోవడానికి విద్యుత్ సంస్కరణలే కారణమని అన్నారు. విద్యుత్ సంస్కరణలపై అప్పటి ప్రతిపక్షాలు తప్పుగా ప్రచారం చేశాయని ఆరోపించారు. అప్పట్లో కాంగ్రెస్ ఉచితంగా కరెంట్ ఇచ్చిందంటే తాము తెచ్చిన సంస్కణలేనని అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చే నాటికి 22.5 మిలియన్ల కరెంట్ కోరత ఉందని తెలిపారు. అనంతరం 2014 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో కరెంట్ కొరత లేకుండా చేశామని అన్నారు.

2015 జనవరి నాటికి మిగులు కరెంట్ సాధించామని పేర్కొన్నారు. 7,700 మెగావాట్ల సోలార్ విండ్ పవర్‌ను.. మొట్టమొదటగా ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. ఇందంతా తమ ముందుచూపుతోనే సాధ్యమైందని అన్నారు. 2014-19 మధ్య కాలంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయని అన్నారు. అసమర్థ పాలన వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందుకు పడ్డారని ఫైర్ అయ్యారు. సోలార్ విండ్ పవర్‌‌ను వినయోగించుకోలేదని.. వితండవాదంతో తమపై వైసీపీ విమర్శలు చేసిందని అన్నారు. ఓ వ్యక్తి ఇగోకి రాష్ట్రం రూ.9 వేల కోట్లు కట్టాల్సి వచ్చిందని తెలిపారు. విద్యుత్ రంగంలో ఊహించని అవకాశాలు వచ్చాయని, ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటామని అన్నారు. గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఓడలు, విమానాలు కూడా గ్రీన్ ఎనర్జీతోనే నడుస్తాయని అన్నారు.

Read Also..

వైకుంఠపురం DPR రూపొందిస్తున్నాం.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

Next Story