మోదీ నాయకత్వంలో భారత్ లో స్థిరమైన ప్రభుత్వం ఉంది : సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

మోదీ నాయకత్వంలో భారత్ లో స్థిరమైన ప్రభుత్వం ఉంది : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి వేదికగా జరుగుతున్న భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు.

2038 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. భారత్ ఏర్పడి వందేళ్లు గడిచేనాటికి.. అంటే 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని, ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని తెలియజేశారు. దశాబ్దా కాలంగా చాలా దేశాల్లో జన సంఖ్య తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. భారత్ లో మాత్రం అందుకున్న భిన్నంగా జన సంఖ్య పెరిగిందన్నారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ దేశానికి అందిస్తున్న సేవలు ఎనలేనివన్నారు. ఎటువంటి పదవిని ఆశించకుండా మోహన్ భగవత్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. దేశంలో నాలెడ్జ్ కు కొదవ లేదన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే భారత్ కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. అదే విధంగా భారత్ ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద యోగా అని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఆరోగ్య సంరక్షణలో యోగాది కీలక పాత్రగా పేర్కొన్నారు. విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

దేశాభివృద్ధిలో అనేక రంగాల భాగస్వామ్యం ఉంటుందన్నారు. అవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడు సుస్థిరాభివృద్ధి సాకారమవుతుందన్నారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో స్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరో స్పేస్ సిటీ, విశాఖలో మెడ్ టెక్ పార్కు వంటివి నిర్మించుకుంటున్నాం అన్నారు. గతంలో తమ ప్రభుత్వం హైదరాబాద్ లో ఐటీని ప్రోత్సహించిందన్నారు. ఐటీ వల్ల ప్రపంచంలో తెలుగువారు ఎక్కువ వేతనాలు పొందుతున్నారన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కీలక స్థానాల్లో భారతీయులే ఉన్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ సంస్థల్లో అత్యధిక జీతాలు పొందుతున్నది తెలుగువారేనని అన్నారు. దేశం పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగుతుందన్నారు. అది ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ వచ్చిందని గుర్తు చేశారు.

మన పురాణాలను నేటి యువతకు తెలియజేసి వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవతార్ సినిమా కంటే రామాయణం, మహాభారతం గొప్పవని పిల్లలకు చెప్పాలన్నారు. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కాకుండా అర్జునుడు, హనుమాన్ గురించి వారికి తెలియజేయాలని సీఎం అన్నారు. ఎన్టీఆర్ వంటి గొప్ప వ్యక్తుల గురించి నేటి సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అబిప్రాయపడ్డారు.జల భద్రత ఉంటే దేశంలో అద్భుత కార్యక్రమాలు చేయగలమన్నారు.

Next Story