అధికారులు చేతులెత్తేస్తే.. గునపాలు పట్టిన గిరిజనులు

by Vemula.Srinu Prasad |

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలోని మరలొవా గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో స్థానిక గిరిజనులు తాగునీటి కోసం మైళ్ల దూరం ప్రయాణించి, ఊట బావులపై ఆధారపడాల్సి వస్తోంది...

అధికారులు చేతులెత్తేస్తే.. గునపాలు పట్టిన గిరిజనులు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలోని మరలొవా గ్రామం(Maralova village)లో తీవ్ర తాగునీటి ఎద్దడి(Drinking water shortage) నెలకొంది. గ్రామంలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో స్థానిక గిరిజనులు తాగునీటి కోసం మైళ్ల దూరం ప్రయాణించి, ఊట బావులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గిరిజన ప్రజలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

రవాణా మార్గం లేక..

బాధిత గిరిజనుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, మరలొవా గ్రామానికి తక్షణమే మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామీణ నీటి సరఫరా (RWS) అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు స్పందించినప్పటికీ, గ్రామానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో తాగునీటి బోరు వేసే వాహనం అక్కడికి చేరుకోలేకపోయింది. దీంతో బోరు బావి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

స్వచ్ఛందంగా శ్రమదానం

ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం తెచ్చుకోవాలనే పట్టుదలతో స్థానిక గిరిజనులు స్వచ్ఛందంగా శ్రమదానానికి దిగారు. బోరు వాహనం గ్రామంలోకి రావడానికి వీలుగా అక్కడి 12 గిరిజన కుటుంబాలు కలిసి ఉమ్మడిగా రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాయి. అధికారులు చొరవ చూపి, రోడ్డు మార్గాన్ని సుగమం చేసి తమ నీటి కష్టాలను తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.

Next Story