ప్రీ బడ్జెట్ సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర ఆర్థికమంత్రి

by Thanuru Gopichand |

ఢిల్లీలో రాష్ట్ర గళాన్ని వినిపించనున్న రాష్ట్ర మంత్రి.

ప్రీ బడ్జెట్ సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర ఆర్థికమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ 2026-27 (Budget 2026-27) రూపకల్పన ప్రక్రియలో భాగంగా నేడు కీలకమైన ప్రీ బడ్జెడ్ (Pre-Budget) సమావేశం జరగనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల అవసరాలు, ప్రాధాన్యతలు, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్రం ఈ సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ అత్యున్నత స్థాయి భేటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) హాజరు కానున్నారు.

​ఈ సమావేశంలో పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల అమలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర సహాయం, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదల వంటి అంశాలపై ఆయన చర్చించనున్నారని సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన ప్రత్యేక ప్రోత్సాహకాలు, కేంద్ర పన్నుల వాటాలో (Devolution) రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా విజ్ఞప్తులు చేయనున్నరని తెలుస్తోంది.

​ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని ఆయన నిర్మల సీతారామన్‌ను కోరనున్నారు. ఈ భేటీ ద్వారా రాష్ట్ర ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు అదనపు రుణ పరిమితి, ప్రత్యేక గ్రాంట్ల వంటి వెసులుబాట్లు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సూచనల ఆధారంగా కేంద్రం తన బడ్జెట్ అంచనాలను తుది రూపం ఇవ్వనుందని తెలియవస్తోంది.

Next Story