దేశీయ విమానయాన శిక్షణ రంగంలో కొత్త శకం.. FTO ర్యాంకింగ్‌ల విడుదల

by Vemula.Srinu Prasad |

దేశీయ విమానయాన రంగంలో పారదర్శకత, నాణ్యత, పనితీరును పెంపొందించడమే లక్ష్యంగా రెండవ దశ 'ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్' ర్యాంకింగ్‌లను ఈరోజు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు...

దేశీయ విమానయాన శిక్షణ రంగంలో కొత్త శకం.. FTO ర్యాంకింగ్‌ల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: దేశీయ విమానయాన రంగంలో పారదర్శకత, నాణ్యత, పనితీరును పెంపొందించడమే లక్ష్యంగా రెండవ దశ 'ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్' (FTO) ర్యాంకింగ్‌లను ఈరోజు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohn Naidu) తెలిపారు. భారతీయ క్యాడెట్ల కోసం 'ట్రైన్ ఇన్ ఇండియా, ఫ్లై ఇన్ ఇండియా' (భారతదేశంలోనే శిక్షణ పొందండి - ఇక్కడే విమానాలు నడపండి) అనే దార్శనికతను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. శిక్షణ ప్రమాణాలను మెరుగుపరచడం, భద్రతను పెంపొందించడం, విమాన శిక్షణ పాఠశాలల్లో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఎంతగానో దోహదపడుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిగణనలోకి కీలక అంశాలు


ఈ ర్యాంకింగ్‌ల కోసం భద్రతా ప్రమాణాలు, కోర్సు పూర్తి చేయడానికి పట్టే సగటు సమయం, విద్యార్థులు, విమానాల నిష్పత్తి (Student-to-aircraft ratio), మరియు అందుబాటులో ఉన్న విమానాల సంఖ్య వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీనివల్ల పైలట్ కావాలనుకునే విద్యార్థులు తమకు నచ్చిన ఫ్లయింగ్ స్కూల్‌ను ఎంచుకునేటప్పుడు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. నిరంతర పర్యవేక్షణ మరియు డేటా ఆధారిత విశ్లేషణ ద్వారా భారతీయ FTOలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ ప్రక్రియ వెనుక ఉన్న అసలు లక్ష్యమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

గణనీయమైన ప్రగతి


గత ఆరు నెలల క్రితం విడుదల చేసిన మొదటి ర్యాంకింగ్‌లతో పోలిస్తే, ప్రస్తుత ర్యాంకింగ్‌లలో భారతీయ విమాన శిక్షణ సంస్థలు తమ పని తీరులో గణనీయమైన ప్రగతిని కనబరిచాయని కేంద్రమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ సంస్థల నిర్వహణ సామర్థ్యం పెరగడం దేశీయ విమానయాన రంగ భవిష్యత్తుకు శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా విమానయాన రంగంలో భారతదేశం గ్లోబల్ హబ్‌గా ఎదిగేందుకు మార్గం సుగమం అవుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

రామ్మోహన్ నాయుడు ట్వీట్...

Next Story