- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకం : డిప్యూటీ సీఎం
రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

దిశ, వెడ్ డెస్క్ : రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో (Collectors Conference) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సాధించిన ప్రగతిని వివరిస్తూ.. సుమారు 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. అలాగే నీటి సంరక్షణలో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా 1.20 లక్షల ఫాం పాండ్స్ (పంటకుంటలు) తవ్వడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం (నరేగా) ద్వారా సుమారు 4,330 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో నేరుగా లబ్ధిదారులకు చెల్లించామని అన్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు కేవలం నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేలా రెవెన్యూ ఆర్జన మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధిని విస్మరించకూడదని, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, వంద శాతం ఫలితాలు సాధించిన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన జిల్లాలు కూడా ముందడుగు వేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని పిలుపునిచ్చారు.






