ఆ మూడు జిల్లాల బాధ్యతలు.. విజయసాయిరెడ్డికే

by Disha Web Desk 21 |
ఆ మూడు జిల్లాల బాధ్యతలు.. విజయసాయిరెడ్డికే
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ క్రియాశీలం అవుతున్నారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు సమాచారం. సీఎం జగన్ రెండు రోజుల క్రితమే ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. తొలుత విజయసాయి రెడ్డి విముఖత చూపారు. తప్పదని జగన్ పట్టుపట్టడంతో అనివార్యంగా భుజానికెత్తుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని సీఎం పిలిపించుకున్నారు. ఆయన సమక్షంలోనే మాట్లాడి సాయిరెడ్డికి బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొన్నటి గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం.. నెల్లూరు జిల్లాలో తిరుగుబాట్లు.. ప్రకాశంలో బావా మరుదుల వైరం పార్టీని బాగా కుంగదీశాయి. వీటన్నింటినీ చక్కదిద్దేందుకు విజయసాయి రెడ్డిని రంగంలోకి దించుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో మరోసారి అవకాశం వస్తుందని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు. ఆయన ఆశలు అడియాసలయ్యాయి. ఆదిమూలపు సురేష్ రెండో దఫా మంత్రి కావడంతో బాలినేని పనైపోయిందనే ప్రచారం పార్టీ క్యాడర్​లోకి విస్తృతంగా వెళ్లింది. దీన్ని ఆయన తట్టుకోలేకపోయారు. అందుకే బొల్లాపల్లి టోల్​ గేట్​ దగ్గర నుంచి అతి భారీ కాన్వాయ్​తో విజయవాడ నుంచి ఒంగోలు చేరారు. తర్వాత ఆయన్ని జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల సమన్వయకర్తగా నియమించారు. దీన్ని కూడా బాలినేని జీర్ణించుకోలేకపోయారు.

వైవీ టార్గెట్ గా బాలినేని కామెంట్లు..

నెల్లూరు జిల్లా నుంచి ఒకరికి ముగ్గురు సీనియర్​ ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేయడంతో బాలినేని ప్రతిష్ట కొంత మసకబారింది. అసమ్మతులను ఆయన సరిగ్గా హ్యాండిల్​ చేయలేకపోయారని సీఎం జగన్​ భావించినట్లుంది. మరోవైపు తన కుటుంబాన్ని అప్రతిష్టపాల్జేయడానికి పార్టీలోని పెద్ద తలకాయ కుట్ర పన్నిందని బాలినేని తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. పార్టీలో తన ఇమేజ్​ను తగ్గించేందుకు కుయుక్తులు పన్నుతున్నారంటూ తన బావమరిది వైవీ సుబ్బారెడ్డిని పరోక్షంగా టార్గెట్​ చేశారు. గతంలో ఒంగోలు ఎంపీగా చేసి ఉన్నందున వైవీకి అనుచర వర్గం ఉంది. వీళ్ల వల్ల పార్టీలో కుమ్ములాటలు ఎక్కువవుతాయనే జగన్​ బాలినేనికి వేరే జిల్లాల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.

బాలినేని రాజీనామా అందుకేనా..

ఇటీవల బాలినేని సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఒంగోలు నియోజకవర్గంలో గడప గడపకూ కార్యక్రమం నిర్వహణలో వెనుకబడడం, ఆరోగ్యం సహకరించనందున తాను నియోజకవర్గానికే పరిమితమవుతానని పేర్కొన్నారు. జగన్​ స్వయంగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా బాలినేని అంగీకరించలేదు. ఈ కారణాలన్నింటిరీత్యా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలను సాయిరెడ్డి భుజస్కంధాలపై ఉంచాలని జగన్​ నిర్ణయించారు.

సాయిరెడ్డి అయిష్టంగానే..

సాయిరెడ్డి సొంత జిల్లా నెల్లూరు. ప్రకాశం జిల్లాలో జగన్​కు బంధువులైన బాలినేని, వైవీ మధ్య తలదూర్చడం ఇష్టం లేక రీజనల్ కోఆర్డినేటర్ పదవి వద్దనుకున్నారు. సీఎం తప్పదని ఒత్తిడి చేయడంతో అనివార్యంగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో బాలినేని మళ్లీ తలదూర్చకుండా ఉంటారా.. తన హవాను ప్రదర్శించకుండా మౌనం వహిస్తారా అనేది మిలియన్​ డాలర్ల ప్రశ్న. ఈ పరిస్థితుల్లో సాయిరెడ్డి ఎలా నెట్టుకొస్తారనే దానిపై పార్టీ క్యాడర్​లో ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.



Next Story