గత ప్రభుత్వం ఆ పనులను మధ్యలోనే నిలిపివేసింది: మంత్రి నారాయణ

by Jakkula.Mamatha |

ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ(శనివారం) విజయవాడలో పర్యటించారు.

గత ప్రభుత్వం ఆ పనులను మధ్యలోనే నిలిపివేసింది: మంత్రి నారాయణ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ(శనివారం) విజయవాడలో పర్యటించారు. ఈ క్రమంలో పుల్లేటి కట్ట, దర్శి పేట అవుట్ ఫాల్ డ్రెయిన్లు, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ దిగువున వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, ఆటో నగర్ డంపింగ్ యార్డ్‌లను మంత్రి పరిశీలించారు. అవుట్ ఫాల్ డ్రెయిన్లు ప్రవాహానికి ఇబ్బందిగా మారిన అక్రమ కట్టడాలు తొలగించాలని VMC కమిషనర్ కు ఆదేశించారు. ఈ క్రమంలో ఇళ్లు కోల్పోయిన వారికి టిడ్కో ఇళ్లు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విజయవాడ సిటీ లో వర్షపు నీరు, మురుగు నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీల నిర్మాణానికి 2014లోనే పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. ఆ పనులను గత వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే నిలిపివేసిందని అన్నారు. 10 అడుగులు ఉండాల్సిన చోట డ్రెయిన్లు 2 అడుగులు మాత్రమే ఉన్నాయి. నగరంలో చాలా చోట్ల డ్రెయిన్లు ఆక్రమణలకు గురయ్యాయని మంత్రి తెలిపారు. కొందరు కాలువల్లో ప్రహరీ గోడలు నిర్మించారు. అలాంటి చోట్ల వెడల్పు చేయకుంటే విజయవాడ ప్రజలకు ఇబ్బందులు తప్పవు అని మంత్రి హెచ్చరించారు.

ఈ తరుణంలో ఆక్రమణలను మార్కింగ్ చేసి డ్రెయిన్లు వెడల్పు చేయాలని కమిషనర్‌ను మంత్రి నారాయణ ఆదేశించారు. ఆక్రమణలు ఉన్న చోట స్థానిక ప్రజాప్రతినిధులు వారితో మాట్లాడతారు. పేదలను ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని.. ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వీఎంసీ, సీఆర్డీయే నిధులతో విజయవాడలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి విజయవాడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆక్రమణలపై ఇరిగేషన్ శాఖ సాంకేతిక కమిటీ వేసింది. బుడమేరు విషయంలో రెండు రకాల ప్రతిపాదనలున్నాయి. ఇరిగేషన్ అధికారులతో కార్పొరేషన్ అధికారులు సమన్వయం చేసుకుని త్వరలో నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ వెల్లడించారు.

Next Story