- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆగని వివాదం! మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ
ఎమ్మెల్యే శ్రీధర్‌పై సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌పై సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. పార్టీ అధినేత ఆదేశాలను, నిబంధనలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆమె తాజా వీడియోలో ఆరోపించారు. ఇటీవలే కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చిన హర్షవీణ, కేసు విషయాలపై తాను మాట్లాడనని స్పష్టం చేశారు. ‘నాకు ఇటీవల బెయిల్ వచ్చింది. కండిషన్ బెయిల్ కారణంగా నేను కేసులకు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు, నేను మాట్లాడను కూడా. కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే..’ అంటూ పార్టీ నాయకత్వాన్ని ఆమె నేరుగా ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ వేసిన కమిటీ ఏమైంది?
గతంలో తన ఆరోపణల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించి విచారణ కమిటీ వేశారని, నివేదిక వచ్చే వరకు ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారని హర్ష వీణ గుర్తుచేశారు. ఈ క్రమంలో నిన్న జరిగిన పార్టీ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వేసిన విచారణ కమిటీ ఏమైంది? అరవ శ్రీధర్ పార్టీ కండువా వేసుకొని కార్యక్రమాలు చేస్తున్నాడు.. కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? పవన్ కల్యాణ్ ఇంటర్నల్‌గా రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ రాకుండా, చర్యలు లేకుండా.. పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడు? అని ఆమె ప్రశ్నలు వేసింది.
నివేదికను బహిర్గతం చేయాలి
శిక్షా కాలంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే హోదాలో మీటింగులకు హాజరవడంపై పవన్ కల్యాణ్ నేరుగా స్పందించి వివరణ ఇవ్వాలని హర్షవీణ డిమాండ్ చేశారు. కమిటీ నివేదికలో ఏముందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పే పార్టీ.. నిందితులకు కొమ్ముకాస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితురాలు వరుస వీడియోలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో, జనసేన ఈ వ్యవహారంపై విచారణ నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.






