విద్యార్థినిని గర్భవతిని చేసిన లెక్చరర్...అబార్షన్ చేసుకోవాలంటూ దారుణం

by Seetharam |
విద్యార్థినిని గర్భవతిని చేసిన లెక్చరర్...అబార్షన్ చేసుకోవాలంటూ  దారుణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : గురువును దేవుడితో కొలిచే సంప్రదాయం మనది. అందుకే గురువును గురు బ్రహ్మ అని కొలుస్తారు. విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితానికి ఒక చక్కటి మార్గాన్ని చూపించే దేవుడిగా ఉపాధ్యాయుడిని భావిస్తారు. అంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఓ వ్యక్తి తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి దారి తప్పాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన విద్యార్థినిపై కన్నేశాడు. కామాంధుడిలా మారి ఆ బాలిక జీవితాన్ని సర్వనాశనం చేశాడు. గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించుకోవాలని చావబాదాడు. దీంతో సదరు విద్యార్థిని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.

ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి

మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరింది. అయితే అదే కాలేజీలో గొవింద్ నాయక్ అనే వ్యక్తి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లై ఓ కొడుకు సంతానం కూడా. చక్కటి భార్య..మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ అతడి వక్రబుద్ధి మాత్రం వదల్లేదు. పాఠాలు చెప్పమని వచ్చిన విద్యార్థినిపై కన్నేశాడు. ఓ రోజు కాలేజీ నుంచి ఒంటరిగా వెళ్తున్న బాలికను ఇంటి దగ్గర దింపుతానని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. పట్టణ శివారుల్లోకి తీసుకెళ్లి అక్కడ ఆమెపై దారుణానికి పాల్పడటంతో కొన్ని ఫోటోలను సైతం చిత్రీకరించాడు. అనంతరం ఆ అశ్లీల ఫోటోలను చూపిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేక ఆ బాలిక సెకండ్ ఇయర్ వేరే కాలేజీలో చేరింది. అయినప్పటికీ అతడి బుద్ధి ఏమాత్రం మారలేదు. కాలేజ్ మారడంతో గోవింద్ నాయక్ వికృత చేష్టలతో మరింత రెచ్చిపోయాడు. ఆమె న్యూడ్ ఫోటోలను వేరే వాళ్లకు చూపిస్తానంటూ బెదిరిస్తూ లొంగదీసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న గోవింద్ నాయక్ అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. అబార్షన్ చేయించుకునేందుకు బాలిక భయపడింది. చేయించుకోనని చెప్పేసింది.

అబార్షన్ కోసం కడుపుపై దాడి

అప్పటికే పెళ్లై ఓ కొడుకు కూడా ఉన్న గోవింద నాయక్ బాలిక గర్భం దాల్చడంతో ఆందోళన చెందాడు. అంతే బాలికను అబార్షన్ చేయించాలని ప్లాన్ వేశాడు. ఎన్నిసార్లు బతిమిలాడినా వినకకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు. కడుపుపై తీవ్రంగా కొట్టాడు. దీంతో కామాంధుడి చేతిలో గాయాలపాలైన ఆ బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలిని పరిశీలించిన వైద్యులు కడుపుపై దెబ్బలు తగలంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని తెలిపారు. వెంటనే అబార్షన్ చేయించారు. అనంతరం వైద్యులు, కుటుంబ సభ్యుల సహకారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు ప్రైవేట్ లెక్చరర్ గోవింద్ నాయక్‌ పై అత్యాచారం, పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షలు నిమిత్తం విద్యార్థినిని ఆసుపత్రికి తరలించినట్లుగా మార్కాపురం ఎస్ఐ కోటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు.

Next Story