- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ ఎన్టీఆర్ రాద్ధాంతం వెనక పరిటాల శ్రీరాం?
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరుపారేసుకున్న వివాదం రాజకీయ మలుపు తిరగడానికి కారణం ఎవరు? అన్న ప్రశ్నకు టీడీపీ అధిష్టానానికి సమాధానం దొరికినట్లు తెలుస్తోంది.

దిశ, ప్రత్యేక ప్రతినిధి: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరుపారేసుకున్న వివాదం రాజకీయ మలుపు తిరగడానికి కారణం ఎవరు? అన్న ప్రశ్నకు టీడీపీ అధిష్టానానికి సమాధానం దొరికినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీలో ఒక వెలుగు వెలిగిన పరిటాల రవి వారసుడు శ్రీరామ్ హస్తం ఉన్నట్లు ఆ పార్టీ అంతర్గత విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇటీవల వరుసగా దూమారం రేపుతున్న టీడీపీ ఎమ్మెల్యేల అంశాలతోపాటు పరిటాల శ్రీరామ్ అంశాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలని నిఘా విభాగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవాలు వెల్లడైన తర్వాతే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
అంతర్గత కలహాలే కారణమా?
ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలోని అంతర్గత కలహాలు ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రారంభమయ్యాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ వివాదానికి ఇవే కారణాలని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నెలకొన్న విభేదాల వల్లే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ధనుంజయ నాయుడు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు వచ్చిందని అందరూ అనుకున్నారు.
భారీ కుట్ర..
ఈ వివాదం బహిర్గతం వెనుక భారీ కుట్ర ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా నిర్వహించుకున్న విచారణలో వెల్లడి అయినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా నిర్వహించుకున్న విచారణలో దీని వెనుక ఉన్న వ్యక్తి టీడీపీ నాయకుడు, పరిటాల శ్రీరామ్ అని తేలడంతో పార్టీ అగ్రనాయకులు సైతం నిర్ఘాంతపోయినట్లు సమాచారం.
నరేంద్ర చౌదరే సూత్రధారా?
పరిటాల శ్రీరామ్ సమీప బంధువు లింగా నరేంద్ర చౌదరి ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా పార్టీ సానుభూతిపరులు అనుమానిస్తున్నారు. సంఘటన మొత్తం పరిటాల శ్రీరామ్‌కు ముందుగానే తెలిసి జరిగిందని కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి దగ్గుపాటి ప్రసాద్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య విభేదాలు ఉండటంతో ‘వార్ 2’ సినిమాపై వచ్చిన వివాదాన్ని తెలివిగా ప్రభాకర్ చౌదరిపైకి నెట్టేసినట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది. నరేంద్ర చౌదరి పరిటాల కుటుంబానికి సమీప బంధువు కావడం.. పరిటాల కుటుంబానికి నమ్మినబంటులా ఉండడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.
పరిటాల శ్రీరామ్ వర్సెస్ దగ్గుపాటి ప్రసాద్..
గత కొద్ది నెలలుగా దగ్గుపాటి ప్రసాద్ అంటే పరిటాల శ్రీరామ్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం పట్టణంలో పరిటాల రవికి ఉన్న పట్టు దగ్గుపాటి రాకతో విచ్ఛిన్నం కావడం శ్రీరామ్‌కు ఎంత మాత్రం నచ్చలేదని పార్టీ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ వివాదం తెరపైకి రావడం.. పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులకు దగ్గరగా ఉండడం.. అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీరామ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఇంత కుట్ర పన్నుతాడని ఎవరూ ఊహించలేదని పార్టీలో ఊహాగాహనాలు ఊపందుకున్నాయి.
నరేంద్ర చౌదరిని అడ్డుపెట్టుకొని...
పరిటాల రవికి సమీప బంధువు ఎల్ నారాయణ చౌదరి.. అతని కుమారుడే లింగా నరేంద్ర చౌదరి. వయస్సు రీత్యా పరిటాల శ్రీరామ్‌కు కన్నా పెద్ద అయినా.. శ్రీరామ్ మాట తూచా తప్పకుండా నరేంద్ర చౌదరి పాటిస్తాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిటాల శ్రీరామ్.. నరేంద్ర చౌదరిని ప్రతి కార్యక్రమానికి పిలుస్తుంటారని, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా ఆయనకు పరిచయం చేస్తుంటారని తెలుస్తోంది. అయితే పరిటాల శ్రీరామ్ సూచనల మేరకే లింగా నరేంద్ర చౌదరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వివాదాన్ని రాజకీయ మలుపు తిప్పినట్లు సమాచారం.
అవాక్కయిన అధిష్టానం...
జూనియర్ సినిమా వివాదం రాజకీయ మలుపు తిరుగుతోందని తెలియడంతో పార్టీ అగ్ర నాయకులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు ఆ పార్టీలో గుసుగుసలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ని అవమానించాలని గానీ, అతని సినిమాకు నెగెటీవ్ పబ్లిసిటీ చేయాలని కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎవరూ అనుకోరని పార్టీ నాయకులు అంటున్నారు. గ్రూపు తగాదాల నేపథ్యంలో వివాదాన్ని పెద్దది చేయడమే కాకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ధర్నాలు చేయాలని పిలుపునివ్వడం వరకూ తీసుకువెళ్లారంటే ఎంతకు తెగించారో అర్ధం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.
పార్టీకి అప్రతిష్ట తేవాలని..
జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై వచ్చిన వివాదం సద్దుమణగకుండా చేయడంలో కూడా లింగా నరేంద్ర చౌదరి ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడి అయిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్‌ను కూడా కుట్రపూరితంగానే బయటకు తెచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డు పైకి తేవడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, టీడీపీ క్యాడరుకు నడుమ రాష్ట్రవ్యాప్తంగా తగాదా వచ్చేలా చేసిన వారిపై పార్టీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.






