- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు భాషా వైభవానికి పట్టం కట్టాలి: జస్టిస్ పిఎస్ నరసింహ
యువత తమ మూలాలను మరచిపోకూడదు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు భాష (Telugu Language) మన సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అని.. ఆ భాషా వైభవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ (Justice PS Narasimha) ఉద్ఘాటించారు. అట్టహాసంగా రెండో రోజు జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు (Prapancha Telugu Mahasabhalu) ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ నరసింహ మాట్లాడుతూ.. మాతృభాష కేవలం భావ వ్యక్తీకరణకు మాత్రమే పరిమితం కాదన్నారు. అది మన చరిత్రను, వారసత్వాన్ని భావి తరాలకు అందించే వారధి అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఏకమై భాషాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరభాషా మోజులో పడి మాతృభాషను విస్మరించకూడదని ఆయన హితవు పలికారు.
న్యాయవ్యవస్థలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత గురించి కూడా జస్టిస్ నరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలకు న్యాయస్థానాల తీర్పులు అర్థమయ్యేలా ఉండాలంటే న్యాయ ప్రక్రియలో మాతృభాషకు ప్రాధాన్యత పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్పులను తెలుగులోకి అనువదించడం ద్వారా సామాన్యులకు న్యాయం మరింత చేరువవుతుందన్నారు. చట్టపరమైన అంశాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని తెలిపారు. కోర్టుల్లో వాదోపవాదాలు, తీర్పులు మాతృభాషలో ఉన్నప్పుడు కక్షిదారులకు తమ కేసు విషయంలో పూర్తి స్పష్టత ఉంటుందన్నారు. తద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం రెట్టింపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యువత తమ మూలాలను మర్చిపోకుండా తెలుగు భాషను గర్వంగా స్వీకరించాలని జస్టిస్ నరసింహ పిలుపునిచ్చారు. ఆధునిక కాలంలో సాంకేతికతను జోడించి తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ మహాసభలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక్కటి చేయడమే కాకుండా మరుగున పడుతున్న పద సంపదను, కళలను పునరుద్ధరించడానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. భాషాభివృద్ధికి జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాలు అభినందనీయమన్నారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు భాషాభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






