రేపు మన్యం బంద్ కు సీపీఎం మద్ధతు

by Thanuru Gopichand |

పోలవరం (Polavaram) జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ రేపు మన్యం బంద్ (Manyam Bandh) నిర్వహించనున్నారు.

రేపు మన్యం బంద్ కు సీపీఎం మద్ధతు
X

దిశ, వెబ్ డెస్క్ : పోలవరం (Polavaram) జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ రేపు మన్యం బంద్ (Manyam Bandh) నిర్వహించనున్నారు. పోలవరం ఆదివాసీ గ్రామాల ప్రజలు చేపట్టిన ఈ బంద్ కు సీపీఎం (CPM) సంపూర్ణ మద్ధతును ప్రకటించారు. ఈ మేరకు సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఓ ప్రకటనను విడుదల చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ప్రకటించి, పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలవరం జిల్లా ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం నేతిబీరలో నెయ్యి లేనట్టుగానే ఉందని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం ప్రత్యేక జిల్లా అని ప్రకటించినప్పుడు ప్రాజెక్టు నిర్మాణం అయ్యేదే పోలవరంలో అని, ఫలితంగా పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు నిర్వాసితులవుతున్నారని అన్నారు. వారికి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. చివరికి చింతూరు రెవెన్యూ డివిజన్‌ వారికీ ఇక్కడే పునరావాసం కల్పిస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు రంపచోడవరం మాత్రమే జిల్లాగా ప్రకటిస్తే సగం మంది నిర్వాసితులను వదిలేసినట్లే కదా? అని ప్రశ్నించారు.

రంపచోడవరం, పోలవరం ఎస్‌టి నియోజకవర్గాలు, షెడ్యూల్డ్‌ ప్రాంతాలు, 1/70 పీసా చట్టాలు అమలవుతున్న ప్రాంతం అని తెలియజేశారు. రెండూ కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన చట్టాల అమలుకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టడానికి వీలవుతుందని సూచించారు. వెనుకబడన ప్రాంతాలు అయినందున శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తే ప్రాంత అభివృద్ధికి కార్యాచరణ రూపొందించే వీలు ఏర్పడుతుందన్నారు. పోలవరం ప్రాంత ఆదివాసీ, ప్రజా సంఘాల ఆందోళనలో న్యాయం ఉందన్నారు. అందుకే వారు రేపు నిర్వహించే బంద్ కు సంపూర్ణ మద్ధతును ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. బంద్ కు అంతా సహకరించి విజయవంతం చేయాలని కోరారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలవరం ఆదివాసీ ప్రాంతాన్ని కూడా చేర్చాలని రవి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Next Story