- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ అడ్డం తిరిగిన కొరకరాని కొయ్య.. అసలు కథ ఇదేనా..?
కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీలో కోల్డ్ వార్ మరింత ముదిరింది...

దిశ, వెబ్ డెస్క్: కొరకరాని కొయ్య మళ్లీ అడ్డం తిరిగింది. ఎంపీని టార్గెట్ చేసింది. రూ.5 కోట్లు అడిగినట్లు సంచలన ఆరోపణలు చేసింది. దీంతో పార్టీలో ప్రకంపనలు చెలరేగాయి. దెబ్బతో అధిష్టానం దిగి వచ్చింది. పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశం జారీ చేసింది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తొలిసారి పోటీ చేసినా ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే పార్టీ కార్యకర్తలతో పొసగలేదు. అటు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అధిష్టానం వద్దకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు పిలిచి మాట్లాడారు. ఇక నుంచి సజావుగా ఉండాలని ఆదేశించారు. కొద్ది రోజులు సక్రమంగా నడుకున్నా మరో వివాదం తెరపైకి వచ్చింది. మళ్లీ అధిష్టానం పిలిచి మాట్లాడింది. ఈ సారి మళ్లీ ఫిర్యాదులు అందితే సీరియస్ యాక్షన్ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడే హెచ్చరించారు.
కానీ కొలికిపూడిలో మార్పు రాలేదు. అధికార పార్టీ నేతలపైనే విమర్శలకు దిగారు. నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీంతో తిరువూరు నియోజకవర్గం సమన్వయ బాధ్యతలను ఎంపీ కేశినేని చిన్నికి అప్పగించారు. ఈ నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. కొలికపూడి వర్సెస్ చిన్నిగా రాజకీయం మారింది. తిరువూరు(Tiruvuru)లో పార్టీ తరపున ఎంపీ చిన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే లేకుండా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో కొలికిపూడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఎమ్మెల్యేను ఆహ్వానించినా రాలేదని చిన్ని వర్గం ఆరోపిస్తోంది.
దీంతో ఎంపీ చిన్ని, కొలికపూడి శ్రీనివాసరావు మధ్య అధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. ఈ మేరకు ఎంపీ చిన్ని(Mp Chinni)పై కొలికపూడి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికలకు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కేశినేని చిన్ని రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని, రెండు విడతల్లో రూ. 60 లక్షలు ఇచ్చానని తెలిపారు. చిన్ని ఎంపీ పీఏ మోహన్ సైతం తన నుంచి రూ. 50 లక్షలు తీసుకెళ్లారని పేర్కొన్నారు.
అయితే కొలికిపూడి వ్యాఖ్యలపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు కోసం తాను టికెట్లు అమ్ముకునే రకం కాదన్నారు. చంద్రబాబును అవమానించిన వారికి టికెట్లు ఇవ్వమని తెగేసి చెప్పారు. కొలికిపూడి ఎవరి పంచన ఉన్నారో అందిరికి తెలుసన్నారు.
ఈ నేపథ్యంలో ఇద్దరి వార్‌పై అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ కార్యాలయంలో ఇద్దరితో మాట్లాడేందుకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఎదుట ఇద్దరు నేతలు శుక్రవారం హాజరుకానున్నారు. అయితే ఇన్ని సార్లు వివాదాలకు కారణమైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం కష్టమేనని తిరువూరు టీడీపీ(Tdp) కేడర్ అంటోంది. పార్టీ అధిష్టానం నుంచి ఇదే ఫైనల్ వార్నింగ్ కానుందని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..?.






