- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఆయుష్ వైద్యానికి మహర్దశ
కేంద్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 'అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూటు ఫర్ యోగా అండ్ నేచురోపతి'ను రాష్ట్రంలో నిర్మించనుంది...

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 'అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూటు ఫర్ యోగా అండ్ నేచురోపతి' (ఆర్' వై ఎస్)ను రాష్ట్రంలో నిర్మించనుంది. రూ.750 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఆస్పతిలో ఎయిమ్స్ తరహాలో కార్యకలాపాలు కొనసాగుతాయి. సెంట్రల్ కౌన్సెల్ ఫర్ రీసెర్చి అండ్ యోగా అండ్ నేచురోపతి (మినిస్టరీ ఆఫ్ ఆయుష్) ద్వారా ఏర్పాటుకానుంది. ఈ ప్రముఖ విద్యా సంస్థలో యూజీ (బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సర్జరీ)లో తొలి ఏడాదిలో వంద సీట్లు, పీజీలో 20 సీట్ల చొప్పున భర్తీ జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా 450 పడకలతో అన్ని రకాల వసతులతో నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి అందుబాటులోనికి వస్తుంది. ఈ సంస్థలో రీసెర్చి అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుంది. ప్రఖ్యాత విద్యా సంస్థ ఏర్పాటుకు 40 ఎకరాలను కేటాయించాలని కేంద్ర ఆయుష్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కొత్త వైద్య కళాశాల రాకతో నేచురోపతి వైద్యం మరింత విస్తరించనుంది. నేచురోపతి వైద్యులు పెరుగుతారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆయుష్ శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ అతున్నత సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్ శాఖ తరపున జాతీయ వైద్య సంస్థలు నడుస్తున్నాయి వీటికంటే ఉన్నత స్థాయిలో రాష్ట్రంలో రాబోయే ఈ సంస్థ ద్వారా కార్యకలాపాలు కొనసాగుతాయి.
ప్రత్తిపాడు మండలంలో రీసెర్చి ఇన్స్టిట్యూటు ఏర్పాటుకు అదనంగా..!
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం (కాటూరు వైద్య కళాశాల వద్ద) సమీపంలో రూ. 100 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రీసెర్చి ఇన్స్టిట్యూటు ఆఫ్ యోగా, నేచురోపతి సంస్థను ఏర్పాటు చేయబోతుంది. దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం 12.96 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ కేవలం వైద్య సేవలు మాత్రమే అందుబాటులోనికి వస్తాయి. ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే నడుస్తుంది.
విశాఖలో...
"విశాఖలో నేచురోపతి కళాశాల నిర్మాణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో నేచురోపతి కోర్సులో వంద సీట్ల భర్తీకి కేంద్రం నుంచి ఆమోదం లభించనుంది.
తొలిసారిగా రూ.165.65 కోట్లు...
గతంలో ఎన్నడూలేనివిధంగా కేంద్ర ఆయుష్ శాఖ 2025-26 బడ్జెటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 165 65 కోట్లను కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొలివిడత కింద తన వాటా కింద 50% నిధులు మంజూరుచేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా విడుదల చేసింది. కేంద్రం ఆమోదం తెలిపిన ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయి. అలాగే ధర్మవరంలో ఆయుర్వేద వైద్య కళాశాల కొత్తగా రాబోతుంది. ముఖ్యమైన పట్టణంలో యూనాని వైద్య కళాశాల కూడా ఏర్పాటుకానుంది. మంత్రి సత్యకుమార్ చూపుతున్న చొరవతో ఆయుష్ వైద్యానికి మహర్దశ పట్టింది.






