విమానయాన రంగం అంతర్జాతీయంగా విశేష గుర్తింపు సాధించింది

by Thanuru Gopichand |

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత విమానయాన రంగంలో అంతర్జాతీయంగా విశేష గుర్తింపు సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

విమానయాన రంగం అంతర్జాతీయంగా విశేష గుర్తింపు సాధించింది
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత విమానయాన రంగంలో అంతర్జాతీయంగా విశేష గుర్తింపు సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) భారత్ మద్ధతుతో "ఏ దేశాన్నీ వెనుకబడనీయకూడదు" (No Country Left Behind - NCLB) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ అంశానికి సంబంధించి భారత్ చేపడుతున్న కీలక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షను కేంద్రమంత్రి నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన ICAO ప్రతిపాదించిన "ఏ దేశాన్నీ వెనుకబడనీయకూడదు" (No Country Left Behind - NCLB) అనే లక్ష్యానికి భారత్ అందిస్తున్న మద్దతును ఈ సందర్భంగా ఆయన విశ్లేషించారు. గ్లోబల్ విమానయాన వ్యవస్థలో భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేయడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక సహకారం అందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత విమానయాన రంగం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన గుర్తింపు సాధించిందన్నారు. ఇటీవలే అత్యధిక ఓట్లతో భారత్ తిరిగి ICAO కౌన్సిల్‌కు ఎన్నిక కావడం దేశ ప్రతిష్టకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాల (SARPs) అమలులో ఇతర దేశాలకు మార్గదర్శిగా నిలుస్తూనే, "సహభాగిత" (Sahbhagita) ప్రాజెక్ట్ ద్వారా విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపునకు భారత్ పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. భారతీయ విమానయాన వాటాదారులు అంతర్జాతీయ వేదికలపై క్రియాశీలక పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా గ్లోబల్ ఏవియేషన్ గవర్నెన్స్‌లో కూడా భారత్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. రాబోయే కాలంలో విమానయాన భద్రత, సుస్థిరత, సమ్మిళిత వృద్ధిలో భారత్ తన బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Next Story