టీడీపీలో లోకేశ్ స్థానం సుస్థిరం.. కష్టం, పోరాటం, వ్యూహ రచనే కారణమా..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-15 14:15:11  IST  )

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం కావడం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కొన్నేళ్లుగా పార్టీలో ఆయన పోషించిన పాత్ర, క్షేత్రస్థాయిలో సాధించిన విజయాలు ఈ పదవికి ఆయనను అర్హుడిగా నిలబెట్టాయి.

టీడీపీలో లోకేశ్ స్థానం సుస్థిరం.. కష్టం, పోరాటం, వ్యూహ రచనే కారణమా..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్(Telugu Desam Party national working president Nara Lokesh) నియామకం కావడం ఏపీ(Ap) రాజకీయాల్లో కీలక పరిణామం. కొన్నేళ్లుగా పార్టీలో పోషించిన పాత్ర, క్షేత్రస్థాయిలో సాధించిన విజయాలు ఈ పదవికి ఆయనను అర్హుడిగా నిలబెట్టాయి. లోకేశ్ రాజకీయ ప్రస్థానంలో యువగళం(Yuvagalam) పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర సాగింది. తద్వారా ఆయన సామాన్య ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వారిలో భరోసా నింపడం ద్వారా ఒక "మాస్ లీడర్" (Mass Leader) ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది.

మంగళగిరి విజయం - రాజకీయ పరిపక్వత


అంతకుముందు 2019 ఎన్నికల్లో మంగళగిరి(Mangalagiri)లో ఓటమి పాలైనప్పటికీ లోకేశ్ నిరాశ పడలేదు. ఐదేళ్లు ఆ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేశారు. 2024 ఎన్నికల్లో 90 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం ద్వారా తన రాజకీయ సత్తాను నిరూపించుకున్నారు. ఇది పార్టీ శ్రేణుల్లో లోకేశ్ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది. లోకేశ్ కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా పార్టీ వ్యవస్థను ఆధునీకరించడంలోనూ తనదైన ముద్ర వేశారు. ఐటీడీపీ (iTDP) ద్వారా పార్టీని సోషల్ మీడియాలో బలోపేతం చేయడం, డేటా మేనేజ్‌మెంట్ ద్వారా కార్యకర్తలకు మార్గదర్శనం చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. కోట్లాది మంది కార్యకర్తలను పార్టీలోకి చేర్చడం, వారికి బీమా సౌకర్యం కల్పించడం వంటి చర్యల ద్వారా కేడర్ సంక్షేమానికి పెద్దపీట వేశారు.

సంక్షోభ సమయంలో అండగా లోకేశ్


తెలుగుదేశం అధినేత, తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పార్టీని లోకేశ్ నడిపించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాను, ఇతర పార్టీల నాయకులను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించడంలో చురుకైన పాత్ర పోషించారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ చెల్లాచెదురు కాకుండా కేడర్‌కు ధైర్యం చెప్పి ఐక్యంగా ఉంచగలిగారు. లోకేశ్ నాయకత్వంలో టీడీపీ తన పాత పద్ధతులను మార్చుకుని, యువతకు, కొత్త ముఖాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించింది. పార్టీ కమిటీల నియామకంలో కూడా లోకేశ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. యువతకు, వెనుకబడిన వర్గాలకు (BC) పెద్దపీట వేస్తూ పార్టీని ఫ్యూచర్-రెడీగా సిద్ధం చేస్తున్నారు.

వారసత్వ రాజకీయాల ముద్రను చెరిపేసుకుని..

వారసత్వ రాజకీయాల ముద్రను చెరిపేసుకుని, తన కష్టం, వ్యూహ రచన, ప్రజా పోరాటాల ద్వారా లోకేశ్ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం టీడీపీలో ఒక నూతన శకానికి నాందిగా పలువురు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకూ చూసిన లోకేశ్‌ జాతీయ స్థాయిలో ఎలాంటి వ్యూహ రచనలు చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి.

Next Story